నవంబర్ 14 నుంచి గ్రేటర్ నోయిడాలో మెగా టోర్నీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 14 నుంచి 21 వరకు గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. మొత్తం 18 దేశాల నుంచి 140 మందికి పైగా అగ్రశ్రేణి బాక్సర్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొననున్నారు. వీరిలో ముగ్గురు ఒలింపిక్ పతక విజేతలు కూడా ఉండటం విశేషం. ఈ టోర్నమెంట్‌లో 20 మంది (10 మంది పురుషులు, 10 మంది మహిళలు)తో కూడిన బలమైన జట్టుతో భారత్ బరిలోకి దిగుతోంది.
మాజీ ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ (51 కేజీలు), ప్రస్తుత ప్రపంచ చాంపియన్లు జైస్మీన్ లంబోరియా (57 కేజీలు), మీనాక్షి (48 కేజీలు), రెండుసార్లు ఆసియా చాంపియన్ పూజా రాణి (80 కేజీలు) తదితర స్టార్ బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. పురుషుల విభాగంలో ఈ సీజన్ ప్రపంచ కప్ టోర్నీల్లో పతకాలు సాధించిన హితేశ్ (70 కేజీలు), అభినాశ్ జమ్వాల్ (65 కేజీలు) మరోసారి మెరిపించడానికి సిద్ధమవుతున్నారు.
ప్రపంచంలోని అత్యుత్తమ బాక్సర్లు స్వదేశంలో పోటీ పడనుండటం మన దేశ బాక్సర్లకు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశమని భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) అధ్యక్షుడు అజయ్ సింగ్ పేర్కొన్నారు.
భారత పురుషుల జట్టు: జాదూమణి సింగ్ (48 కేజీలు), పవన్ (55 కేజీలు), సచిన్ (60 కేజీలు), అభినాశ్ జమ్వాల్ (65 కేజీలు), హితేశ్ (70 కేజీలు), సుమిత్ (75 కేజీలు), లక్ష్య చహర్ (80 కేజీలు), జుగ్నూ (85 కేజీలు), నవీన్ కుమార్ (90 కేజీలు), నరేందర్ (ప్లస్ 90 కేజీలు).
భారత మహిళల జట్టు: మీనాక్షి (48 కేజీలు), నిఖత్ జరీన్ (51 కేజీలు), ప్రీతి (54 కేజీలు), జైస్మీన్ లంబోరియా (57 కేజీలు), పర్వీన్ హుడా (60 కేజీలు), నీరజ్ ఫొగాట్ (65 కేజీలు), అరుంధతి చౌధరీ (70 కేజీలు), స్వీటీ బూరా (75 కేజీలు), పూజా రాణి (80 కేజీలు), నుపుర్ (ప్లస్ 80 కేజీలు).


