వరుసగా రెండో ఏడాది ఏటీపీ ఫైనల్స్ టోర్నీ టైటిల్ హస్తగతం
ఒక్క సెట్ కోల్పోకుండా వరుసగా రెండేళ్లు
విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా రికార్డు
ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ అల్‌కరాజ్‌పై విజయం
రూ. 44 కోట్ల 92 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
ట్యూరిన్: సొంతగడ్డపై 2025 సీజన్‌ను ఇటలీ టెన్నిస్ సూపర్ స్టార్ యానిక్ సినెర్ అద్భుతంగా ముగించాడు. పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సినెర్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సింగిల్స్ ఫైనల్లో సినెర్ 7–6 (7/4), 7–5తో ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్‌కరాజ్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. 2 గంటల 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్ ఎనిమిది ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సరీ్వస్‌లో 43 పాయింట్లకుగాను 36 పాయింట్లు... రెండో సరీ్వస్‌లో 35 పాయింట్లకుగాను 19 పాయింట్లు సంపాదించాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు.
ఈ గెలుపుతో సినెర్ వరుసగా రెండో ఏడాది ఏటీపీ ఫైనల్స్ టోరీ్నలో టైటిల్‌ను దక్కించుకున్నాడు. గత సంవత్సరంతోపాటు ఈ ఏడాది కూడా సినెర్ టైటిల్ గెలిచే క్రమంలో ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్ ఓడిపోయినా... ముఖాముఖి రికార్డులో అల్‌కరాజ్ 10–6తో సినెర్‌పై ఆధిక్యంలో ఉన్నాడు.
1970లో ఏటీపీ ఫైనల్స్ టోర్నీ ప్రారంభమయ్యాక ఇప్పటి వరకు వరుసగా రెండేళ్లు ఒక్క సెట్ చేజార్చుకోకుండా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా సినెర్ రికార్డు నెలకొల్పాడు.
టైటిల్ నెగ్గిన సినెర్‌కు 50,71,000 డాలర్ల (రూ. 44 కోట్ల 92 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ అల్‌కరాజ్ ఖాతాలో 27,04,000 డాలర్ల (రూ. 23 కోట్ల 95 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి.
ఏటీపీ ఫైనల్స్ టోర్నీని వరుసగా రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన తొమ్మిదో ప్లేయర్‌గా సినెర్ గుర్తింపు పొందాడు. గతంలో జొకోవిచ్ (సెర్బియా), ఫెడరర్ (స్విట్జర్లాండ్), ఇవాన్ లెండిల్ (చెక్ రిపబ్లిక్), పీట్ సంప్రాస్ (అమెరికా), ఇలీ నస్టాసె (రొమేనియా), జాన్ మెకన్రో (అమెరికా), జాన్ బోర్గ్ (స్వీడన్), లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా) ఈ ఘనత సాధించారు.


