భారత మాజీ క్రికెటర్, దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ఎప్పటికప్పుడు తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. చిన్ననాటి నుంచే తన కుమారుడికి కఠిన శిక్షణ ఇచ్చి మేటి క్రికెటర్‌గా తీర్చిదిద్దాదని చెప్పే యోగ్‌రాజ్.. తన స్వభావం వల్ల యువీ తల్లితో తాను ఎలా విడిపోయాడో కూడా పలు సందర్భాల్లో వెల్లడించాడు.
తాజాగా.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తనయుడు అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar) గురించి యోగ్‌రాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అర్జున్ తండ్రి మాదిరే గొప్పగా బ్యాటింగ్ చేస్తాడని కితాబులిచ్చాడు. బౌలర్ కంటే బ్యాటర్‌గానే అర్జున్ ఉత్తమంగా రాణించగలడని పేర్కొన్నాడు.
నిజానికి అతడొక బ్యాటర్
‘‘అందరూ అర్జున్ టెండుల్కర్ బౌలింగ్ మీదే ఎందుకు దృష్టి పెడతారు?.. నిజానికి అతడొక బ్యాటర్. రంజీ ట్రోఫీకి ముందు సచిన్, యువరాజ్... అర్జున్‌కు శిక్షణ ఇవ్వమని నన్ను అభ్యర్థించారు. అపుడు 10-12 రోజుల పాటు అర్జున్‌కు కోచింగ్ ఇచ్చాను. అర్జున్ జాగ్రత్తగా చూసుకోమని సచిన్, యువీ చెప్పారు.
కానీ ఓ రోజు అతడికి గట్టిగా దెబ్బ తగిలింది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాము. తను కోలుకున్నాడు. ఈ క్రమంలో ఓరోజు నేను అర్జున్‌తో బ్యాటింగ్ చేయమని చెప్పాడు. కానీ అతడు అందుకు సుముఖంగా లేడు. అయితే, నేను మాత్రం ‘నీ బ్యాటింగ్ చూడాల్సిందే’ అని పట్టుబట్టాను.
ఫోర్లు, సిక్సర్లు బాదాడు
దీంతో అతడు బ్యాటింగ్ మొదలుపెట్టాడు. నెట్స్‌లో ఫోర్లు, సిక్సర్లు బాదాడు. అప్పుడు నేను అర్జున్ కోచ్‌తో మాట్లాడాను. ‘ఇంతబాగా బ్యాటింగ్ చేస్తున్నాడు? మరెందుకని అతడితో కేవలం బౌలింగే ప్రాక్టీస్ చేయిస్తున్నారు? బ్యాటర్‌గా అతడిలో మంచి నైపుణ్యం ఉంది. తండ్రి మాదిరే అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు’ అని అన్నాను.
అర్జున్‌తో రోజూ కనీసం 2-3 గంటలు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించమని చెప్పాను. అన్నట్లుగానే రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే అర్జున్ సెంచరీ బాదాడు’’ అని యోగ్‌రాజ్ సింగ్.. రవి బిస్త్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా యోగ్‌రాజ్ చెప్పినట్లుగా 2022-23 సీజన్‌లో రంజీల్లో అడుగుపెట్టిన అర్జున్.. ఏడో స్థానంలో వచ్చి 207 బంతుల్లో 120 పరుగులు సాధించాడు.
ఓపెనర్‌గానూ
అదే మ్యాచ్‌లో కొత్త బంతితో బౌలింగ్‌కు దిగిన అర్జున్.. మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. అయితే, ఆ తర్వాత క్రమంగా ముంబై జట్టులో చోటు కోల్పోయిన అతడు.. గోవాతో జట్టుకట్టాడు. ఇటీవల గోవా తరఫున ఓపెనర్‌గానూ అర్జున్ బరిలోకి దిగాడు. అయితే, ఇప్పటికి వరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 620 పరుగులు చేసి.. 48 వికెట్లు పడగొట్టిన అర్జున్.. లిస్ట్-ఎ, టీ20 క్రికెట్‌లో 25, 35 వికెట్లు పడగొట్టాడు.
సచిన్‌తో పోలికా?.. మతి చెడిందా?
కాగా లెఫ్టార్మ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన అర్జున్ నైపుణ్యం గల ఆటగాడే. అయితే, దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్‌తో పోల్చడం ఎంతమాత్రం సరికాదని అభిమానులు యోగ్‌రాజ్ మాటలను ఖండిస్తున్నారు. యోగ్‌రాజ్‌కు మతి చెలించిందంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు, శతక శతకాలు సాధించిన సచిన్ చెక్కుచెదరని ఈ రెండు రికార్డులను తన ఖాతాలో కొనసాగిస్తూనే ఉన్నాడు.
చదవండి: పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడిని.. ఇక్కడ ఇలా: ఉస్మాన్ ఖవాజా


