మనుమడు ఓరియోన్, కుమారుడు యువీతో షబ్నమ్
టీమిండియా మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ మాట మార్చాడు. భారత దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh), అతడి తల్లి షబ్నమ్‌ను చేతులు జోడించి మరీ క్షమాపణలు కోరుతున్నానంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.
కాగా చండీగఢ్‌కు చెందిన యోగ్‌రాజ్ సింగ్ గతంలో షబ్నమ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి యువరాజ్ సింగ్, జొరావర్ సంతానం. అయితే, పితృస్వామ్య భావజాలం కలిగిన యోగ్‌రాజ్.. షబ్నమ్‌ను ఇంట్లో పెట్టి తాళం వేసినంత పనిచేశాడు. ఆమె తరఫు బంధువులను కూడా ఇంట్లోకి రానివ్వలేదు.
అంతేకాదు.. క్రికెటర్‌గా తీర్చిదిద్దే క్రమంలో యువరాజ్ సింగ్‌ను కూడా ఎంతో కష్టపెట్టాడు. ఒకానొక సమయంలో అతడి శిక్షణ తట్టుకోలేక యువీ చనిపోతాడని తన తల్లి హెచ్చరించినా కరుణించలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యోగ్‌రాజ్ సింగ్ స్వయంగా ఈ విషయాలు వెల్లడించాడు.
మీరే నా పరువు. తల చుట్టూ దుపట్టా ఉండాలి
అంతేకాదు.. తాను ఎవరి విషయంలోనూ పశ్చాత్తాపపడే పనిచేయలేదని కూడా యోగ్‌రాజ్ (Yograj Singh) వ్యాఖ్యానించాడు. అంతేకాదు.. మహిళలకు స్వాతంత్ర్యం అవసరం లేదని.. వారికి కుటుంబ బాధ్యతలు అప్పగిస్తే అంతా అస్తవ్యస్తమైపోతుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తన రెండో భార్య నీనా, కూతురు అమీకి.. ‘మీరే నా పరువు. తల చుట్టూ దుపట్టా ఉండాలి. లేదంటే నా ప్రాణం పోయినట్లే’ అని హెచ్చరిక చేసినట్లు కూడా వెల్లడించాడు.
మీ ఇద్దరిని వేదనకు గురిచేశా.. వీలైతే నన్ను క్షమించండి
అయితే, తాజాగా ఫైవ్‌వుడ్ పాడ్‌కాస్ట్‌లో యోగ్‌రాజ్ సింగ్ మాట్లాడుతూ.. తన ప్రవర్తన పట్ల ముఖ్యంగా యువీ, అతడి తల్లి విషయంలో చేసిన తప్పులపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ‘‘నా జీవితంలో చేసినవన్నీ తప్పులే. అయితే, నా ఆత్మగౌరవం, కుటుంబ పరువు కోసమే అన్నీ చేశాను.
ఈ క్రమంలో జీవితంలోని ఎన్నో జ్ఞాపకాలను తుడిచివేశాను. గురు (దేవుడు) చెప్పిన మాటలే విన్నాను. అయితే, ఇప్పుడు చేతులు జోడించి క్షమాపణలు అడుగుతున్నా.
నా వల్ల ఇబ్బందులకు గురైన ప్రతి ఒక్కరినీ క్షమించమని కోరుతున్నా. కుటుంబ సభ్యులైనా, బయటి వ్యక్తులైనా నా వల్ల బాధపడి ఉంటే సారీ. నా పిల్లల్ని క్షమాపన కోరుతున్నా. ముఖ్యంగా నా భార్య.. యువీ తల్లిని.. నన్ను క్షమించాలని వేడుకుంటున్నా.
తప్పంతా నాదే. నా సహచర ఆటగాళ్లు, స్నేహితుల విషయంలోనూ నోటికొచ్చినట్లు మాట్లాడాను. క్రికెట్‌లో, సినిమాల్లో ఎవరినైనా తిట్టి ఉంటే సారీ. మీరంతా నన్ను క్షమించండి.
నాలో తప్పులు, అవలక్షణాలు మాత్రమే ఉన్నాయి
నాలో ఎలాంటి గొప్ప గుణాలు లేవు. కేవలం నాలో తప్పులు, అవలక్షణాలు మాత్రమే ఉన్నాయి. జీవితంలో నేను ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఇకపై కలలో కూడా మరోసారి తప్పులను పునరావృతం చేయను. నేను నిశ్చితంగా నిద్రపోతాను. నాకు ఇప్పుడు మందులు అక్కర్లేదు.
నేను చనిపోయినపుడు ఆ గురు నన్ను చూసి గర్విస్తే చాలు’’ అని యోగ్‌రాజ్ సింగ్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇటీవల తాను తీవ్ర అస్వస్థతకు గురయ్యానని.. అప్పుడే అందరి విలువా తెలిసిందని తెలిపాడు. తన మాజీ భార్య షబ్నమ్, ప్రస్తుత భార్య నీనాలను ‘మాతా’గా అభివర్ణించిన యోగ్‌రాజ్ సింగ్.. తన కుమారుల్లో ‘గురు’ను చూసుకుంటున్నానని ఉద్వేగానికి లోనయ్యాడు.
కాగా యోగ్‌రాజ్ సింగ్ 1980-81 మధ్యకాలంలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, అతడి కుమారుడు యువరాజ్ సింగ్ భారత క్రికెట్ చరిత్రలో ఉత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా భారత్ టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 గెలవడంలో యువీది కీలక పాత్ర.
చదవండి: మా అమ్మకి 19 ఏళ్లు.. నాన్నకు 60 ఏళ్లు.. నా కూతురే నా పరువు.. హద్దు దాటితే అంతే!


