
తల్లితో యువరాజ్ సింగ్
టీమిండియా మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh)తన విడాకులకు గల కారణాన్ని వెల్లడించాడు. తాను పెట్టిన కఠినమైన నిబంధనల వల్లే.. షబ్నమ్ (Shabnam)తో తన పెళ్లి పెటాకులైందంటూ కుండబద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌కు ఆడిన యోగ్‌రాజ్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.
యువీ భవిష్యత్తు కోసమే
భారత్‌కు తొలి వరల్డ్‌కప్ అందించిన కపిల్ దేవ్ (Kapil Dev) వల్లే తన కెరీర్ నాశనమైందని భావించిన యోగ్‌రాజ్.. తన కుమారుడి రూపంలో టీమిండియాకు అత్యుత్తమ ఆల్‌రౌండర్‌ను అందించాలని భావించాడు. ఇందుకోసం క్రమశిక్షణ పేరిట తన కొడుకు యువరాజ్ సింగ్ (Yuvraj Singh) పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించానని యెగ్‌రాజ్ ఇటీవలే వెల్లడించాడు.
ఒకానొక దశలో తన తల్లి యువీ మానసిక స్థితి గురించి చాలా భయపడిపోయిందని.. మనుమడి పట్ల దయ చూపాలని కోరిందని యోగ్‌రాజ్ తెలిపాడు. అయినా తన మనసు కరగలేదని.. యువీ భవిష్యత్తు కోసమే కఠినంగా ఉన్నానంటూ తనను తాను సమర్థించుకున్నాడు. తాజాగా ఎస్‌ఎమ్‌టీవీకి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో యువీ తల్లి షబ్నమ్‌తో తన విడాకులకు గల కారణం గురించి వెల్లడించాడు.
ఒక రకంగా ఇంట్లో పెట్టి తాళం వేసినట్లు చేశా
‘‘విదేశీయుల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో నేను చదువుకున్నా. మా నాన్న క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. నేను అదే మిగిలిన వాళ్లపై ప్రయోగించాను. నా భార్య షబ్నమ్‌తోనే ఇది మొదలుపెట్టాను.
నా అనుమతి లేకుండా బయటకు వెళ్లవద్దని ఆదేశించా. ఒక రకంగా ఇంట్లో పెట్టి తాళం వేసినట్లు చేశా. ఇక తన కుటుంబ సభ్యులు ఎవరూ మా ఇంటికి రావొద్దని హెచ్చరించా. ఒకవేళ ఎవరైనా దారి తప్పి వచ్చినా వాళ్లు నాకు ఎలాంటి సలహాలు ఇవ్వద్దని కచ్చితంగా చెప్పేశా.
వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పా
మాకు కుమారుడు జన్మించిన తర్వాత.. నాలో దాగి ఉన్న కసినంతా బయటకు తీసి.. నా కొడుకుని లెజెండ్‌గా తీర్చిదిద్దుతా అని మా అమ్మకు చెప్పాను. నన్ను తప్పుగా చూపించే ప్రయత్నం చేసిన కపిల్ దేవ్ వంటి వాళ్లపై ప్రతీకారం తీర్చుకునేందుకు నా కుమారుడిని అస్త్రంగా వాడుకోవాలని నిర్ణయించుకున్నా.

అందుకే కష్టపెట్టైనా సరే వాడిని అత్యుత్తమ ఆల్‌రౌండర్‌ని చేశా. ఏదేమైనా పితృస్వామ్య భావజాలం గల నాతో షబ్నమ్ ఇమడలేకపోయింది. యువీ, తన తల్లి నన్ను విడిచిపెట్టి వెళ్లిన రోజు.. నా జీవితంలో తొలిసారిగా ఏడ్చాను.
నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతా. నాకు నటన రాదు. అందుకే నా పరిస్థితి ఇలా అయింది. మా వాళ్లు నన్ను ఓ పిచ్చోడు అనుకున్నారు’’ అని యోగ్‌రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.
యువీ తల్లిని పెళ్లి చేసుకుని తప్పు చేశా
ఇక గతంలో ఇదే విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘యువీ తల్లిని పెళ్లి చేసుకుని తప్పు చేశా. నేనొక రైతుని. ఆమె వ్యాపార కుటుంబం నుంచి వచ్చింది. నాకున్న మగ అహంకారంతో ఆమెను పంజరంలో బంధించినట్లు చేశా.
అది ఆమెకు నచ్చలేదు. అయినా సర్దుకుపోయేది. కానీ ఒకానొక దశలో మా ఇద్దరికీ అస్సలు పడలేదు.అందుకే విడిపోవాల్సి వచ్చింది’’ అని యెగ్‌రాజ్ సింగ్ తెలిపాడు. కాగా షబ్నమ్- యోగ్‌రాజ్‌లకు యువరాజ్ సింగ్‌తో పాటు జొరావర్ సంతానం. విడాకుల తర్వాత యోగ్‌రాజ్ నీనా బుంధేల్ అనే నటిని పెళ్లి చేసుకోగా.. వీరికి కుమారుడు, కుమార్తె జన్మించారు.
చదవండి: ‘యువీ గనుక తన పిల్లల్ని.. నాకు అప్పగిస్తే వారికీ అదే ‘గతి’ పట్టిస్తా’