
టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తండ్రి యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే యోగ్‌రాజ్.. తాజాగా మరోసారి తన ‘బోల్డ్ కామెంట్స్’తో తెరమీదకు వచ్చాడు. ఈసారి యువీ కెరీర్ గురించి కాకుండా.. తమ వ్యక్తిగత జీవితాల గురించి యోగ్‌రాజ్ మాట్లాడటం విశేషం.
యువీకి కోచ్‌గా వ్యవహరించిన యోగ్‌రాజ్ చిన్ననాటి నుంచే అతడికి చుక్కలు చూపించేవాడట. క్రికెటర్‌గా తాను అనుకున్న శిఖరాలకు చేరుకోలేకపోయానన్న కసిని కుమారుడి మీద తీర్చుకున్నట్టు గతంలో పలు సందర్భాల్లో చెప్పిన యోగ్‌రాజ్.. మరోసారి ఈ విషయం గురించి మాట్లాడాడు.
ఏదో ఒకరోజు యువీ చచ్చిపోతాడని..
లక్ష్యం దిశగా నడిపించేందుకు ఒక రకంగా యువీని హింసించానన్న యోగ్‌రాజ్.. తన తల్లి మరణశయ్యపై ఉన్నపుడు మనుమడి గురించి బెంగపడిందని తెలిపాడు. ఒకవేళ ఇలాగే ప్రవర్తిస్తే ఏదో ఒకరోజు యువీ చచ్చిపోతాడని బాధ పడిందని.. అయినా తన మనసు మాత్రం కరుగలేదన్నాడు. యువీని ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా తీర్చిదిద్దడం కోసమే అలా చేశానని పేర్కొన్నాడు.
వాడు నన్ను బాపూ అని పిలిచాడు
ఇక యువీ పిల్లల గురించి ప్రస్తావన రాగా.. ‘‘నా మనుమడు ఓరియోన్ పుట్టిన రెండేళ్ల తర్వాత వాడిని చూశాను. వాడికి ఒక్క ముక్క పంజాబీ కూడా మాట్లాడటం రాదని యువీ నాతో చెప్పాడు. అయితే, ఆ తర్వాత రెండు సెకన్లలోనూ వాడు నన్ను బాపూ అని పిలిచాడు.
ఇప్పటికీ ఎప్పుడైనా ఫోన్‌లో మాట్లాడితే నన్ను బాపూ అనే అంటాడు. నిజానికి యువీ- హాజిల్ కీచ్‌లకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. అయితే, వారికి ఓరియోన్‌తో పాటు కుమార్తె ఆరా కూడా జన్మించింది. కానీ వాళ్ల పిల్లల్ని నాతో ఎక్కువగా కలవనివ్వరు.
యువీ గనుక తన పిల్లల్ని.. నాకు అప్పగిస్తే వారికీ అదే ‘గతి’ పట్టిస్తా
ఏదేమైనా యువీ గనుక తన పిల్లల్ని నాకు ఒక్కసారి అప్పగిస్తే.. వారి తండ్రికి పట్టిన గతే వాళ్లకూ పడుతుంది. నిప్పులో కాలిస్తేనే కదా బంగారం మెరుపు బయటపడేది. కాబట్టి నేను యువీ మాదిరే అతడి పిల్లల విషయంలోనూ ఎలాంటి దయా, కరుణా చూపను.
నా గురించి తెలుసు కాబట్టే నన్ను యువీ దూరం పెట్టాడు. పిల్లలతో కలవనివ్వడు. ఏదేమైనా ఓరియోన్ నా తండ్రి పునర్జన్మే అని నా కొడుకు- కోడలు చెప్పడం సంతోషాన్నిచ్చింది. నా చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాను’’ అని యోగ్‌రాజ్ ఎస్‌ఎమ్‌టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడు యువీ
కాగా యువీ స్కేటర్ కావాలని అనుకుంటే.. అతడి తండ్రి యోగ్‌రాజ్ మాత్రం యువీని క్రికెటర్ చేయాలనే సంకల్పంతో ఉండేవాడు. అందుకు తగ్గట్టుగానే యువీని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా తీర్చిదిద్దాడు. టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ యువీది కీలక పాత్ర.
ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన యువీ తన అంతర్జాతీయ కెరీర్‌లో టీమిండియా తరఫున 40 టెస్టుల్లో 1900, 304 వన్డేల్లో 8701, టీ20లలో 1177 పరుగులు సాధించాడు. ఇక లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ఖాతాలో 9 టెస్టు, 111 వన్డే, 28 టీ20 వికెట్లు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. యువీ తల్లి షబ్నమ్‌కు విడాకులు ఇచ్చిన యోగ్‌రాజ్.. ఆ తర్వాత నీనా బుంధేల్ అనే నటిని పెళ్లి చేసుకున్నాడు. ఇక యువీ కెరీర్ త్వరగా ముగిసిపోవడానికి కారణం దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అని యోగ్‌రాజ్ పదే పదే ఆరోపిస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే.
చదవండి: మోసగాడినే అయితే.. నాతో కాపురం ఎలా చేసింది?.. నాలుగున్నరేళ్లు అలా..