
తన మాజీ భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma)ను ఉద్దేశించి టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal) ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తన పేరు వాడుకోనిదే ఒకరికి పూట గడవదని అనిపిస్తే.. వారు అలా చేయడాన్ని తాను తప్పుపట్టనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
ప్రేమ పాఠాలు..
అసలు విషయం ఏమిటంటే.. యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ వద్ద డాన్స్ పాఠాలు నేర్చుకునే క్రమంలో చహల్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాల సమ్మతితో వీరిద్దరు 2020లో పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. ఎక్కడైనా జంటగా వెళ్తూ అన్యోన్యంగా కనిపించే ఈ జంట.. 2025లో విడాకులు తీసుకుని అభిమానులకు షాకిచ్చారు.
ఈ సందర్భంగా తాము 2022 నుంచే విడిగా ఉంటున్నట్లు న్యాయస్థానానికి తెలపడం గమనార్హం. అయితే, విడాకుల తర్వాత పరస్పర ఆరోపణలతో ఇద్దరూ రచ్చకెక్కారు. అధికారికంగా విడాకులు మంజూరు కావడానికి ముందే.. బాలీవుడ్ నటి, ఆర్జే మహ్‌వశ్‌తో చహల్ చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు.

అతడే వదిలిపెట్టాడు
అంతేకాదు.. ధనశ్రీ రూ. 4 కోట్ల భరణం తీసుకున్న నేపథ్యంలో.. ‘‘ఎవరి తిండి వారే సంపాదించుకోవాలి’’ అనే కోట్ ఉన్న షర్ట్ వేసుకుని కోర్టుకు వచ్చాడు చహల్. ఈ పరిణామాల నేపథ్యంలో ధనశ్రీ స్పందిస్తూ.. తాను విడాకులు తీసుకోవాలని అనుకోలేదని.. అతడే తనను వదిలిపెట్టాడంటూ చహల్‌పై ఆరోపణలు చేసింది. ఏదేమైనా చహల్ సంతోషంగా ఉంటే చాలని పేర్కొంది.
పెళ్లైన రెండు నెలల్లోనే
తాజాగా ఓ రియాలిటీ షోలో పాల్గొన్న ధనశ్రీ.. తోటి కంటెస్టెంట్‌తో మాట్లాడుతూ.. పెళ్లైన రెండు నెలల్లోనే చహల్ తనను మోసం చేశాడని.. అయినా తాను సర్దుకుపోయినట్లు తెలిపింది. ఈ వ్యాఖ్యలు వైరల్ కాగా.. చహల్ తాజాగా హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ధనశ్రీ వ్యాఖ్యలను ఖండించాడు.
‘‘ఒకవేళ ఏదైనా బంధంలో ఓ వ్యక్తి రెండు నెలల్లోనే మోసగాడని తెలిస్తే.. అయినా అతడితో కలిసి ఎవరైనా జీవిస్తారా?.. నా దృష్టిలో ఇది ముగిసిన అధ్యాయం. అయిందేదో అయిపోయింది. నేను జీవితంలో ముందుకు సాగుతున్నాను.
నాలుగున్నరేళ్ల కాపురం.. మోసగాడినే అయితే..
కానీ కొందరు అదే పట్టుకుని వేలాడుతున్నారు. అయినా, మేమే నాలుగున్నరేళ్ల పాటు వివాహ బంధంలో ఉన్నాము. కలిసి కాపురం చేశాం. ఒకవేళ నేను నిజంగా మోసగాడినే అయితే.. ఆ వ్యక్తి అంతకాలం నాతో ఎలా కలిసి ఉంటారు?.. నా పేరు చెప్పుకోనిదే ఒకరికి పూట గడవదు అంటే అలాగే చేసుకోనివ్వండి.
వారి మాటలు నాపై ఎలాంటి ప్రభావం చూపలేవు. ఈ విషయంపై నేను స్పందించడం ఇదే ఆఖరిసారి. ముగిసిన అధ్యాయం గురించి మరోసారి మాట్లాడను. నేను ఒక క్రీడాకారుడిని. మోసగాడిని కాదు’’ అని చహల్.. ధనశ్రీకి ఘాటు కౌంటర్ ఇచ్చాడు.
టీమిండియా తరఫున 2016లో అరంగేట్రం చేసిన చహల్.. ఇప్పటి వరకు 72 వన్డేల్లో 121, 80 టీ20లలో 96 వికెట్లు పడగొట్టాడు. ఈ రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ చివరగా.. 2023లో టీమిండిఆకు ఆడాడు. ఇక ఐపీఎల్‌లో 174 మ్యాచ్‌లలో కలిపి 221 వికెట్లు తీసిన చహల్... అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు.
చదవండి: తిట్టకు అమ్మా!.. ఏదో ఒకరోజు ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తా.. కట్‌చేస్తే..