
మిగతా వాటితో పోలిస్తే క్రికెట్, సినిమాలను కెరీర్‌గా ఎంచుకుంటే ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకోవాల్సి ఉంటుంది. వీటిలో విజయశాతం తక్కువ. ముఖ్యంగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇలాంటి రంగాల్లో నిలదొక్కుకోవడం కత్తిమీద సాము లాంటిదే.
నూటికో కోటికో ఒక్కరే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో సఫలమవుతూ ఉంటారు. ఇక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వారు ఇలాంటి పెద్ద పెద్ద కలలు కంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
అయితే, ఆత్మవిశ్వాసం ఉంటే కఠిన సవాళ్లను సైతం సులువుగానే అధిగమించవచ్చని అంటున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్. హైదరాబాద్ గల్లీల నుంచి.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ పేస్ బౌలర్లలలో ఒకడిగా ఎదిగాడు సిరాజ్ మియా.
ఏదో ఒకరోజు ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తా
పట్టుదల ఉంటే ఆటో డ్రైవర్ కుమారుడైనా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని నిరూపించాడు. అయితే, చిన్ననాడు అందరిలాగే తానూ తల్లి చేత చివాట్లు తిన్నాడు సిరాజ్. గల్లీల్లో ఆడుతూ ఉంటే.. ‘ఈ ఆట అన్నం పెడుతుందా?’ అంటూ తల్లి ఆవేదన పడుతుంటే.. ఆమెను ఊరడించేందుకు.. ‘‘ఏదో ఒకరోజు ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తా’’ అని చెప్పాడు.
అయితే, తర్వాతి రోజుల్లో ఆ మాటనే నిజం చేశాడు సిరాజ్. ఈ విషయాల గురించి తాజాగా మాట్లాడుతూ.. ‘‘ఆరోజు నాకింకా గుర్తుంది. నేను క్రికెట్ ఆడేందుకు వెళ్లాను. మా అమ్మకు నేనలా వెళ్లడం అస్సలు ఇష్టం లేదు.
భవిష్యత్తు గురించి నాకు బెంగలేదని తిట్టేది. ఆరోజు కూడా అలాగే తిట్టింది. అప్పుడు నేను.. ‘అమ్మ నన్ను కొట్టడం ఆపేయ్.. ఏదో ఒకరోజు నేను కచ్చితంగా ఈ ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తాను. నువ్వేం బాధపడకు.. నేనది చేసి చూపిస్తా’ అని నమ్మకంగా చెప్పాను.

ఆత్మవిశ్వాసం ఉంటేనే..
ఆరోజు నేను అన్న మాటలు నిజమయ్యాయి. ఆ దేవుడే వాటిని నిజం చేశాడు. ఆత్మవిశ్వాసం ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. ఒకవేళ మీపై మీకు నమ్మకం లేకుంటే జీవితంలో ఏమీ సాధించలేరు. మనల్ని మనం నమ్ముకోవాలి.
మనకంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. దాని కోసమే నిరంతరమూ పరితపించాలి. అప్పుడే అంతా సవ్యంగా సాగుతుంది. నేను ఈరోజు యార్కర్ వేసి వికెట్ తీస్తానని అనుకుంటే.. కచ్చితంగా అది సాధించగలను. నా ఆత్మవిశ్వాసమే అందుకు కారణం. మన ప్రణాళికలను పక్కాగా అమలు చేసినప్పుడు ఏదీ అసాధ్యం కాదు. కఠినంగా శ్రమిస్తే దక్కనిది ఏదీ ఉండదు’’ అని సిరాజ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నాడు.
కాగా హైదరాబాద్ తరఫున దేశీ క్రికెట్‌లో రాణించిన సిరాజ్.. 2017లో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసుకోలేదు. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటిన సిరాజ్.. ఇప్పటి వరకు తన కెరీర్‌లో 42 టెస్టులు, 44 వన్డేలు, 16 టీ20లు ఆడాడు.

విలాసవంతమైన జీవితం
టెస్టుల్లో ఇప్పటికి 130, వన్డేల్లో 71, టీ20లలో 14 వికెట్లు తీసిన సిరాజ్.. ప్రస్తుతం సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. అన్నట్లు పేద కుటుంబంలో జన్మించిన సిరాజ్ నికర ఆస్తుల విలువ ప్రస్తుతం దాదాపు రూ. 60 కోట్లు. చిన్నపుడు ఇరుకు ఇంట్లో నివసించిన సిరాజ్ తల్లిని ఇప్పుడు జూబ్లీహిల్స్‌లోని కోట్ల విలువ గల ఇంట్లో నివసిస్తున్నారు.
అంతేకాదు.. చిన్నపుడు తండ్రితో కలిసి ఆటోలో తిరిగిన ఈ హైదరాబాదీ బౌలర్ గ్యారేజీలో ఇప్పుడు విలాసవంతమైన కార్లు ఎన్నో ఉన్నాయి. అయితే, తన సక్సెస్‌ను పూర్తిగా ఆస్వాదించకుండానే తండ్రి మరణించడం సిరాజ్‌కు ఎప్పటికీ తీరని లోటు!
చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్