
మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తండ్రి, కోచ్ యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాను మగ అహంకారినని ఇప్పటికే స్పష్టం చేసిన ఈ మాజీ క్రికెటర్.. మహిళల గురించి మరోసారి అనుచిత కామెంట్లతో వార్తల్లోకెక్కాడు. ఇంటి పెత్తనం ఆడవాళ్ల చేతిలో పెడితే.. అంతా అస్తవ్యస్తమైపోతుందని పేర్కొన్నాడు.
అందుకే విడాకులు
ఇటీవల ఎస్‌ఎమ్‌టీవీతో మాట్లాడిన యోగ్‌రాజ్ సింగ్.. యువీ తల్లి షబ్నమ్‌తో తన విడాకుల గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. తాను పితృస్వామ్య భావజాలం కలిగిన వ్యక్తినని.. అందుకే షబ్నమ్ తనతో ఇమడలేకపోయిందని తెలిపాడు. అంతేకాదు.. ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసినంత పనిచేశానని.. ఈ క్రమంలోనే సఖ్యత చెడి విడాకులు తీసుకున్నామని పేర్కొన్నాడు.
అంతేకాదు.. యువీని ఉత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దే క్రమంలో.. అతడిని కఠినంగా శ్రమించేలా చేశానన్న యోగ్‌రాజ్.. ఒకవేళ యువీ తన పిల్లల్ని గనుక అప్పగిస్తే వారికీ అదే గతి పట్టిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా హైబ్రో స్టూడియోస్‌తో మాట్లాడిన యోగ్‌రాజ్.. మహిళల స్వాతంత్ర్యం గురించి అవాకులు చెవాకులు పేలాడు.

బిడ్డను ఆ దేవుడే రక్షిస్తాడు
‘‘మహిళలకు నేను అత్యంత గౌరవం ఇస్తా. అయితే, పురుషులు, మహిళకలకంటూ వేర్వేరు బాధ్యతలు ఉంటాయి. తల్లి గర్భంలో ఉన్నపుడు బిడ్డను ఆ దేవుడే రక్షిస్తాడు. తన లోపల ఏం జరుగుతుందో ఆ మహిళకు ఏం తెలుస్తుంది.
దేవుడే ఆమెనూ కాపాడతాడు. బిడ్డ భూమ్మీదకు రాగనే ఏడుస్తాడు. ఎందుకంటే.. అప్పుడే ఆ దేవుడు బిడ్డ వేలిని విడిచిపెడతాడు. ప్రేమైక భాషలో చెప్పాలంటే.. దేవుడు ఆ బిడ్డను తండ్రి చేతుల్లో పెడతాడు. నీ బిడ్డ రాతను నువ్వే రాయమని చెప్తాడు. తల్లికీ కొన్ని బాధ్యతలు ఇస్తాడు.
అలా చేయనివాడు తండ్రే కాడు
ఏడుస్తున్న బిడ్డను తల్లి హత్తుగానే.. బిడ్డ ఏడుపు ఆపేస్తుంది. మాతృమూర్తికి ఉన్న శక్తి అది. ఆ తర్వాత మాత్రం అంతా తండ్రే చూసుకుంటాడు. బిడ్డ రాతను రాసి.. అతడు లేదంటే ఆమెను ప్రయోజకురాలిని చేస్తాడు. అలా చేయనివాడు తండ్రే కాడు.
మా అమ్మకి 19.. నాన్నకు 60
ఇక తల్లి ఇంటి పనులు చుసుకుంటుంది. ఇంటి యజమాని తండ్రి. ఎవరి పని వాళ్లే చేస్తే బాగుంటుంది. ఈ సూత్రాన్ని అనుసరిస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. మా అమ్మ మా నాన్న కంటే వయసులో 42 ఏళ్లు చిన్నది. అమ్మకు 19 ఏళ్లు ఉన్నపుడు 60 ఏళ్ల వయసులో ఉన్న మా నాన్నతో పెళ్లి చేశారు.
అయినా సరే వారి మధ్య ప్రేమకు కొదవలేదు. అసలు అలాంటి ప్రేమను నేను ఎక్కడా చూడలేదు. ఒకరి కోసం ఒకరు బతికారు. ఒకరంటే ఒకరు పడిచచ్చిపోయేవారు. అయితే, మా అమ్మ ఒక స్త్రీగా తన పని చేయడం.. నా తండ్రి పురుషుడిగా బాధ్యతలు నిర్వర్తించడం వల్లే ఇది సాధ్యమైంది.

తల చుట్టూ దుపట్టా ధరించాల్సిందే
ఇక నా కుటుంబంలోనే నేనే యజమానిని. కిట్టీ పార్టీలు ఉండకూడదు. మహిళ కచ్చితంగా తన తల చుట్టూ దుపట్టా ధరించాల్సిందే. పెద్దలు పెట్టిన ప్రతీ నిబంధనను వారు పాటించాలి. చాలా మంది నన్ను తప్పుగా అనుకోవచ్చు.
నా పరువు మీరే
ఏదేమైనా మా ఇంట్లో ఒక్కరూ నా మాట జవదాటరు. నా భార్య, కూతురితో ఒకే మాట చెప్పాను. ‘నా పరువు మీరే’ దానిని ఎప్పటికీ దిగజార్చవద్దు అని హెచ్చరిక చేశాను. ఒకవేళ అదే జరిగతే నా ప్రాణమే పోతుందని చెప్పా.
ఇందులో తప్పేమైనా ఉందా?’’ అంటూ యోగ్‌రాజ్ సింగ్ మరోసారి నిస్సిగ్గుగా తన పితృస్వామ్య భావజాలాన్ని బయటపెట్టడమే కాక.. దానిని సమర్థించుకున్నాడు కూడా!
రెండో పెళ్లి
కాగా యువీ తల్లితో విడాకుల తర్వాత యోగ్‌రాజ్ సింగ్ నీనా బుంధేల్ అనే పంజాబీ నటిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం. ఇక షబ్నమ్‌తో యోగ్‌రాజ్‌కు కుమారులు యువరాజ్, జొరావర్ కలిగారు.
ఇక టీమిండియా తరఫున 1980- 81 మధ్య కాలంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన చంఢీగడ్ యోగ్‌రాజ్ సింగ్.. ఒక టెస్టులో 10 పరుగులు, ఆరు వన్డేల్లో కలిపి ఒక పరుగు చేశాడు. టెస్టుల్లో ఒక వికెట్, వన్డేల్లో నాలుగు వికెట్లు తన ఖాతాలో జమచేసుకున్నాడు ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.
చదవండి: వ్యక్తిగత ఫొటోలు షేర్ చేసిన హార్దిక్ పాండ్యా.. రిలేషన్‌షిప్‌లో ఉన్నా!