భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో 2023లో మొదలైన మహిళా ప్రీమియర్ లీగ్ విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. అరంగేట్ర సీజన్‌లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలవగా.. గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రోఫీని ముద్దాడింది.
ఇక ఈ ఏడాది మరోసారి ముంబై చాంపియన్‌గా అవతరించగా.. 2026లోనైనా టైటిల్ గెలవాలని యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పట్టుదలగా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే వేలానికి ముందు తమకు కావాల్సిన ప్లేయర్లను అట్టిపెట్టుకున్న ఫ్రాంఛైజీలు.. వద్దనుకున్న క్రికెటర్లను వదిలించుకున్నాయి.
బీసీసీఐ సుముఖంగా ఉంది
ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మెగా వేలంలో తమ వ్యూహాలకు అనుగుణంగా ఐదు ఫ్రాంఛైజీలు ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఇక వేలం సందర్భంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ (Parth Jindal) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భారత మహిళా క్రికెట్ రాత మారనుందని.. డబ్ల్యూపీఎల్‌ను విస్తరించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆదరణకు ఇదే నిదర్శనం
ఈ మేరకు.. ‘‘1983లో ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత పురుషుల క్రికెట్ పరిస్థితి ఎంతలా మెరుగుపడిందో మనం చూశాం. వన్డే వరల్డ్‌కప్-2025లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు రాత కూడా మారనుంది. 446 మిలియన్ల మంది భారతీయులు మనోళ్లు ఆడిన ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించారు.
పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్ కంటే కూడా ఈ మ్యాచ్‌కే అత్యధిక వీక్షణలు వచ్చాయి. నిజానికి ఇంతకు ముందు మహిళా వేలం గురించి ఎవరూ మాట్లాడేవారే కాదు. అయితే, ‘నవంబరు 27న వేలంలో మీరు ఏం చేయబోతున్నారు?
మెగ్ లానింగ్‌ను తీసుకుంటారా? మీరెందుకు ఆమెను వదిలిపెట్టారు? వంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. మూడేళ్లుగా లీగ్ జరుగుతున్నా ఎవరూ మరీ ఇంతగా ఆసక్తి చూపించలేదు. వరల్డ్‌కప్ తర్వాత మన మహిళల లీగ్‌కు ఆదరణ పెరిగిందనడానికి ఇదే నిదర్శనం.
ఒకటి లేదంటే రెండు జట్లు..
డబ్ల్యూపీఎల్ విస్తరించబోతోంది. బీసీసీఐ ఇందుకు సంబంధించి ప్రణాళికలు రచిస్తోందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ లీగ్‌లో మరొకటి.. లేదంటే మరో రెండు ఫ్రాంఛైజీలు చేరే అవకాశం ఉంది’’ అని పార్థ్ జిందాల్ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యల్ని బట్టి వచ్చే డబ్ల్యూపీఎల్ సీజన్‌లో మరో రెండు కొత్త జట్లను చూసే అవకాశం లేకపోలేదంటూ మహిళా క్రికెట్‌ను ఆదరించే అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


