ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. తొలి టెస్టు ఆడిన జట్టుతోనే తాము రంగంలోకి దిగుతామని స్పష్టం చేసింది. కాగా సొంతగడ్డపై ఆసీస్ ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (The Ashes 2025-26)లో తలపడుతున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా పెర్త్ వేదికగా నవంబరు 21న ఇరుజట్ల మధ్య మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య ఆసీస్.. ఇంగ్లండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇక డిసెంబరు 4-8 వరకు ఇంగ్లండ్- ఆసీస్ మధ్య రెండో టెస్టు జరుగనుంది. డే- నైట్ మ్యాచ్‌గా నిర్వహించే ఈ పింక్ బాల్ టెస్టు (Pink Ball Test) కంటే ముందు ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ఇంగ్లండ్ తలపడనుంది.
కమిన్స్, హాజిల్‌వుడ్ అవుట్
ఇదిలా ఉంటే.. ఫిట్‌నెస్ సమస్యల వల్ల యాషెస్ తొలి టెస్టుకు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins).. రెండో టెస్టుతో తిరిగి వస్తాడనే ప్రచారం జరిగింది. జట్టుతో పాటు అతడు బ్రిస్బేన్‌కు వచ్చి నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం ఇందుకు కారణం. అయితే, అతడు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోనట్లు సమాచారం.
ఫలితంగా కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ మరోసారి జట్టును ముందుకు నడిపించనున్నాడు. ఇక కమిన్స్‌తో పాటు మరో పేసర్ జోష్ హాజిల్‌వుడ్ కూడా ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు దూరమయ్యాడు. తొడ కండరాల నొప్పి నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదు.
దీంతో తొలి టెస్టుకు ఎంపిక చేసిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా రెండో టెస్టు బరిలోనూ దిగుతున్నట్లు ఆసీస్ ప్రకటించింది. కాగా పింక్ బాల్ టెస్టుకు బ్రిస్బేన్‌లోని గాబా మైదానం వేదిక.
సత్తా చాటిన స్టార్క్
కాగా తొలి టెస్టులో కమిన్స్, హాజిల్‌వుడ్ లేని లోటును మిచెల్ స్టార్క్ పూడ్చాడు. మొత్తంగా పది వికెట్లతో సత్తా చాటి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. కామెరాన్ గ్రీన్, స్కాట్ బోలాండ్, బ్రెండన్ డాగెట్ అతడికి తోడుగా నిలిచారు.
ఇక.. ఇంగ్లండ్ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్‌గా వచ్చిన ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 83 బంతుల్లో 123 పరుగులతో హెడ్ సత్తా చాటగా.. వన్‌డౌన్ బ్యాటర్ లబుషేన్ అజేయ అర్ధ శతకం (51)తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరో ఓపెనర్ వెదర్లాడ్ 23 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ఇదే
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మైఖేల్ నెజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదర్‌రాల్డ్, బ్యూ వెబ్‌స్టర్.
చదవండి: తన వధువుతో ఇంటికి రావాలని కలలు కన్నాడు.. కానీ: పలాష్ ముచ్చల్ తల్లి


