మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 మెగా వేలంలో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు భారీ ధర దక్కింది. న్యూఢిల్లీ వేదికగా గురువారం నాటి వేలంపాటలో యూపీ వారియర్స్ ఆమెను ఏకంగా రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఆదిలో దీప్తి కోసం ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
కాగా డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్ (2023) నుంచి దీప్తి శర్మ యూపీ వారియర్స్‌కే ప్రాతినిథ్యం వహిస్తోంది. అలిసా హేలీ గాయం వల్ల దూరం కావడంతో 2025లో యూపీ కెప్టెన్‌గానూ దీప్తి వ్యవహరించింది. అయితే, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆమె సారథ్యంలో యూపీ కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదు.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్
ఇదిలా ఉంటే.. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో భారత్ విజేతగా నిలవడంలో దీప్తి శర్మదే ముఖ్య పాత్ర. ఈ ఆల్‌రౌండర్ మూడు అర్ధ శతకాల సాయంతో 215 పరుగులు చేయడంతో పాటు.. మొత్తంగా 22 వికెట్లు కూల్చి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకుంది. ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు కూల్చడం హైలైట్‌గా నిలిచింది.
ఢిల్లీ క్యాపిటల్స్ తప్ప
ఈ నేపథ్యంలో యూపీ దీప్తిని రిటైన్ చేసుకుంటుందని భావించగా.. అనూహ్యంగా ఆమెను వేలంలోకి వదిలింది. వేలంలో దీప్తి కోసం ఫ్రాంఛైజీలు ఎగబడతాయని భావించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తప్ప ఎవరూ కనీసం ఆమె వైపు చూడలేదు.
ఈ క్రమంలో కనీస ధర రూ. 50 లక్షలకు దీప్తి వేలంలోకి రాగా ఢిల్లీ అదే ధరకు దీప్తిని కొనుగోలు చేయాలనుకుంది. ఇంతలో రంగంలోకి దిగిన యూపీ.. రైట్ టు మ్యాచ్ (RTM) కార్డు ద్వారా అదే ధర చెల్లించి దీప్తిని సొంతం చేసుకోవాలని భావించింది. అయితే, ఢిల్లీ ఒక్కసారిగా దీప్తి ధరను రూ. 3.2 కోట్లకు పెంచింది.
ఢిల్లీ వదిలేలా లేదని భావించిన యూపీ రూ. 3.2 కోట్ల వద్ద తమ RTM కార్డును ఉపయోగించి దీప్తిని తిరిగి సొంతం చేసుకుంది. ఫలితంగా డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ప్లేయర్‌గా.. ఆష్లే గార్డ్‌నర్ (గుజరాత్- 2023- రూ. 3.2 కోట్లు) రికార్డు సమం చేసింది. కాగా ఆర్సీబీ 2023లో స్మృతి మంధానను రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేయగా.. ఆమె లీగ్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా కొనసాగుతోంది.


