మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2026 టోర్నమెంట్‌కు శుక్రవారం తెరలేచింది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ముంబై ఇండియన్స్‌పై గెలుపొంది శుభారంభం అందుకుంది.

ఆర్సీబీ తరఫున అరంగేట్రం
నవీ ముంబైలో జరిగిన ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ తరఫున ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు లారెన్ బెల్, లిన్సీ స్మిత్ అరంగేట్రం చేశారు. ఫాస్ట్ బౌలర్ బెల్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 14 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసింది. తద్వారా డబ్ల్యూపీఎల్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటింది.
మరోవైపు.. లెఫ్టార్మ్ పేసర్ లిన్సీ స్మిత్ మాత్రం రెండు ఓవర్లలో ఏకంగా 23 పరుగులు ఇచ్చి నిరాశపరిచింది. అయితే, అంతర్జాతీయ టీ20లలో సత్తా చాటిన ఈ ఇద్దరు ఎవరికి ఎవరూ తక్కువకారు. తొలి మ్యాచ్‌లో విఫలమైనా లిన్సీ తిరిగి పుంజుకోగలదు. ఇందుకు గణాంకాలే కారణం.

ఎన్ని వికెట్లు తీశారంటే
బెల్ ఇప్పటికి 36 అంతర్జాతీయత టీ20లలో 50 వికెట్లు కూల్చగా.. లిన్సీ 22 మ్యాచ్‌లు ఆడి 6.6 ఎకానమీతో 22 వికెట్లు తీసింది. వుమెన్స్ 100లో బెల్ ఖాతాలో 60 (41 మ్యాచ్‌లలో), లిన్సీ ఖాతాలో 42 (37 మ్యాచ్‌లలో) వికెట్లు ఉన్నాయి
ఇక బెల్, లిన్సీలతో పాటు మరో ముగ్గురు ప్లేయర్లు కూడా ఈసారి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. వారు మరెవరో కాదు లిజెలి లీ, గొంగడి త్రిష, దీయా యాదవ్.

లిజెలి లీ
సౌతాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ లిజెలి లీ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికి 82 మ్యాచ్‌లు ఆడింది. 33 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో 1896 పరుగులు ఉన్నాయి.
ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వైదొలిగినా.. తన విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా గత దశాబ్దకాలంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గతేడాది వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ లిజెలిని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఇప్పటికి 104 మ్యాచ్‌లు ఆడి ఐదు సెంచరీలు బాది.. 2770 పరుగులు చేసిన లిజెలి డబ్ల్యూపీఎల్‌నూ వాచౌట్ ప్లేయర్.

గొంగడి త్రిష
తెలంగాణ ఆల్‌రౌండర్, టీమిండియా అండర్-19 స్టార్ గొంగడి త్రిష. అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో మొట్టమొదటి సెంచరీ చేసిన మహిళా క్రికెటర్‌గా ఆమె చరిత్రకెక్కింది.
టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడంతో పాటు.. పార్ట్‌టైమ్ లెగ్ స్పిన్నర్‌గా రాణించడం ఆమెకు ఉన్న అదనపు బలం. అయితే, గత రెండు సీజన్లలో వేలంలో పేరు నమోదు చేసుకున్నా ఫ్రాంఛైజీలు ఆమెను పట్టించుకోలేదు.
ఈసారి యూపీ వారియర్స్ మాత్రం రూ. 10 లక్షల కనీస ధరకు 20 ఏళ్ల త్రిషను కొనుగోలు చేసింది. కీలక మ్యాచ్‌లలో ఫియర్‌లెస్ క్రికెట్ ఆడగల సత్తా ఉన్న త్రిషకు ఒక్క అవకాశం వచ్చినా తనను తాను నిరూపించుకోగలదు. ఇప్పటి వరకు 33 టీ20 మ్యాచ్‌లు ఆడిన త్రిష 583 పరుగులు సాధించింది.

దీయా యాదవ్
పదహారేళ్ల దీయా యాదవ్‌ను రూ. 10 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. తద్వారా అత్యంత పిన్న వయసులో డబ్ల్యూపీఎల్ కాంట్రాక్టు పొందిన ప్లేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. అండర్ 15 వన్డే కప్‌లో డబుల్ సెంచరీ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన దీయా.. దేశీ టీ20 క్రికెట్‌లోనూ నిలకడైన ఆటతో ఆకట్టుకుంటోంది. ఈమె కూడా ఈసారి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
చదవండి: T20 WC: వేటు వేసిన సెలక్టర్లు.. తొలిసారి స్పందించిన శుబ్‌మన్ గిల్


