యాషెస్ 2025-26 సిరీస్‌లో వరుస పరాజయాల తర్వాత బాక్సింగ్ డే టెస్టు గెలుపు రూపంలో ఇంగ్లండ్‌కు ఊరట దక్కింది. ఆస్ట్రేలియా హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ కైవసం చేసుకున్నప్పటికీ.. నాలుగో టెస్టులో గెలవడం ద్వారా స్టోక్స్ బృందం వైట్‌వాష్ గండం నుంచి ముందుగానే గట్టెక్కింది.
ఇక సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జనవరి 4 నుంచి మొదలయ్యే ఐదో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను విజయంతో ముగించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో యాషెస్ తాజా ఎడిషన్‌లో చివరి టెస్టుకు తమ ప్లేయింగ్ XIIను ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది.
విల్ జాక్స్‌తో పోటీ
ఈ జట్టులో ఎట్టకేలకు స్పిన్నర్ షోయబ్ బషీర్ (Shoaib Bashir) చోటు దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌తో పోటీ నెలకొన్న తరుణంలో ప్రస్తుతానికి 12వ ఆటగాడిగా ఉన్న బషీర్.. తుదిజట్టులో ఉంటాడా? లేదా? అనేది మ్యాచ్ రోజు తేలనుంది. మరోవైపు.. ప్రధాన జట్టులో ఉన్నా ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన మాథ్యూ పాట్స్ (Matthew Potts)కు ఈసారి స్థానం దక్కింది.
పాట్స్ రీఎంట్రీ
గాయం కారణంగా గస్ అట్కిన్సన్ దూరం కాగా.. అడిలైడ్‌లో జరిగిన మూడో టెస్టు తర్వాత జోఫ్రా ఆర్చర్ కూడా గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు. ఇక మార్క్‌వుడ్ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఈ ముగ్గురి గైర్హాజరీ పాట్స్ పాలిట వరంగా మారింది.
డిసెంబరు 2024లో చివరగా టెస్టు మ్యాచ్ ఆడిన ఈ పేస్ బౌలర్ యాషెస్ చివరి టెస్టుతో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. గట్కిన్సన్ రీప్లేస్‌మెంట్‌గా అతడు తుదిజట్టులోకి వచ్చాడు.
ఆస్ట్రేలియాతో యాషెస్ 2025-26 చివరి టెస్టు ఇంగ్లండ్ ప్లేయింగ్ XII
బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్.
అదే జట్టు
మరోవైపు.. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్ చివరి టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టులో ఏ మార్పు చేయలేదు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే ఆసీస్ 3–1తో సొంతం చేసుకోగా... ఆఖరిదైన ఐదో టెస్టు ఆదివారం సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. దీని కోసం క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
గత మ్యాచ్‌లో ఓడినప్పటికీ అదే జట్టును కొనసాగిస్తోంది. స్టీవ్ స్మిత్ జట్టుకు సారథ్యం వహించనుండగా... ఆసీస్ బృందం గురువారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో సంపూర్ణ ఆధిపత్యంతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి సిరీస్ నిలబెట్టుకున్న ఆతిథ్య ఆసీస్... నాలుగో టెస్టులో పరాజయం పాలైంది.
దీంతో ఇంగ్లండ్ జట్టు పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కంగారూ గడ్డపై టెస్టు మ్యాచ్ నెగ్గింది. పూర్తిగా పేసర్లకు సహకరించిన మెల్‌బోర్న్ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో... సిడ్నీలో ఐదో టెస్టుకు ఎలాంటి పిచ్ సిద్ధం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
చదవండి: KKR: అతడొక ద్రోహి.. కేకేఆర్ ఇలాంటి పనిచేస్తుందా?.. బీసీసీఐ స్పందన ఇదే


