క్రికెట్‌కు సంబంధించి 2026 సంవత్సరానికి అదిరిపోయే ఆరంభం లభించింది. ఏడాది తొలి మ్యాచ్‌లోనే ఆసక్తికర ఫలితం వచ్చింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో భాగంగా డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగి, సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. సూపర్ ఓవర్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ పైచేయి సాధించింది.
ఈ మధ్యలో హైడ్రామా చోటు చేసుకుంది. జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆటగాడు డొనొవన్ ఫెరియెరా (డాన్) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి, ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఆల్‌రౌండ్ షో అంటే బ్యాటింగ్, బౌలింగ్ మత్రమే కాదు వికెట్‌కీపింగ్ కూడా.
తొలుత బ్యాటింగ్‌లో సుడిగాలి ఇన్నింగ్స్ (10 బంతుల్లో 33 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) ఆడిన డాన్.. ఆతర్వాత బౌలింగ్‌లో (4-0-24-1), ఆఖర్లో వికెట్ కీపింగ్‌లో (చివరి బంతికి ఒక పరుగు చేస్తే ప్రత్యర్ది గెలిచే సమయంలో అద్భుతమైన రనౌట్ చేశాడు) అదరగొట్టి ఓడిపోవాల్సిన మ్యాచ్‌ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లాడు. సూపర్ ఓవర్‌లో రిలీ రొస్సో అద్భుతంగా బ్యాటింగ్ చేసి సూపర్ కింగ్స్‌ను గెలిపించాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. డివిలియర్స్ (38), డుప్లెసిస్ (47), శుభమ్ రంజనే (50 నాటౌట్), డొనొవన్ ఫెరియెరా (33 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. డర్బన్ బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-12-3) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హార్మర్ (4-0-22-1) కూడా పర్వాలేదనిపించాడు.
అనంతరం 206 పరుగుల లక్ష్య ఛేదనలో డర్బన్ జట్టు చివరి బంతి వరకు గెలుపు కోసం పోరాడింది. చివరి బంతికి ఒక్క పరుగు చేస్తే గెలుస్తుందన్న తరుణంలో డాన్ మ్యాజిక్ రనౌట్ చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లాడు. ముల్దర్ బౌలింగ్‌లో బ్యాటింగ్ చేసిన హార్మర్ బంతిని కట్ చేసే క్రమంలో మిస్ అయ్యాడు. అయినా పరుగుకు ప్రయత్నించగా.. అప్పుడు వికెట్‌కీపింగ్ చేస్తున్న డాన్ అద్భుతమైన రీతిలో బాష్‌ను రనౌట్ చేశాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది.
సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ వికెట్ కోల్పోయి 5 పరుగులు మాత్రమే చేయగలిగింది. గ్లీసన్ అద్బుతంగా బౌలింగ్ చేసి డర్బన్ బ్యాటర్లు జోస్ బట్లర్, ఆరోన్ జోన్స్‌ను కట్టడి చేశాడు. 6 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రిలీ రొస్సో 3 బంతుల్లో 2 బౌండరీలు బాది సూపర్ కింగ్స్‌ను గెలిపించాడు.


