సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో డర్బన్ సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ చెలరేగిపోయాడు. పార్ల్ రాయల్స్‌తో నిన్న (జనవరి 17) జరిగిన కీలక మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా సూపర్ జెయింట్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
శివాలెత్తిన మార్క్రమ్
తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ జెయింట్స్.. మార్క్రమ్ శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. మార్క్రమ్ 58 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో తన రెండో శతకాన్ని నమోదు చేశాడు.
సికందర్ రజా వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో మార్క్రమ్ శివాలెత్తిపోయాడు. 3 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 28 పరుగులు పిండుకున్నాడు. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. సునీల్ నరైన్ 4, జోస్ బట్లర్ 1, కేన్ విలియమ్సన్ 22, హెన్రిచ్ క్లాసెన్ 29, లియామ్ లివింగ్‌స్టోన్ 19 పరుగులకు ఔటయ్యారు.
రాయల్స్ బౌలర్లలో హర్దస్ విల్యోన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఫోర్టుయిన్, బార్ట్‌మన్, పోట్గెటర్ తలో వికెట్ తీశారు.
అనంతరం 190 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్స్ తడబడింది. సునీల్ నరైన్ (4-0-18-2), సైమన్ హార్మర్ (4-1-13-1), మార్క్రమ్ (2-0-9-1), లివింగ్‌స్టోన్ (3-0-25-1), కొయెట్జీ (3-0-31-2), మపాకా (2-0-10-1) వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేయడంతో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రాయల్స్ ఇన్నింగ్స్‌లో ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. వెర్రిన్ (23), హెర్మన్ (18), సికందర్ రజా (21), ఫోర్టుయిన్ (35 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ జట్టుతో పాటు ప్రిటోరియా క్యాపిటల్స్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ కూడా ప్లే ఆఫ్స్ బెర్త్‌లు కన్ఫర్మ్ చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, ఎంఐ కేప్‌టౌన్ మధ్య పోటీ జరుగుతుంది.


