PC: Sunrisers Eastern Cape
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ తమకు తిరుగులేదని నిరూపించింది. ముచ్చటగా మూడోసారి చాంపియన్‌గా అవతరించింది. కేప్‌టౌన్ వేదికగా ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఓడించి.. ట్రోఫీని ముద్దాడింది.
ట్రిస్టన్ స్టబ్స్ సారథ్యంలో సౌతాఫ్రికా టీ20 లీగ్-2026 బరిలో దిగింది సన్‌రైజర్స్. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ చేరి సత్తా చాటింది. ఈ క్రమంలోనే టైటిల్ పోరుకు అర్హత సాధించిన సన్‌రైజర్స్.. తుదిమ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఢీకొట్టింది. న్యూలాండ్స్ మైదానంలో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
బ్రెవిస్ విధ్వంసకర శతకం
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 158 పరుగుల నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్ బ్రైస్ పార్సన్స్ (30) ఓ మోస్తరుగా రాణించగా.. డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసకర శతకం (56 బంతుల్లో 101)తో విరుచుకుపడ్డాడు. దీంతో క్యాపిటల్స్‌కు ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది.
సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి మిగతా వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మార్కో యాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టగా.. లూతో సిపామ్లా, అన్రిచ్ నోర్జే తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్.. 19.2 ఓవర్లలో పని పూర్తి చేసింది.
దంచికొట్టిన బ్రీట్జ్కే, స్టబ్స్
ఓపెనర్లలో క్వింటన్ డికాక్ (18) నిరాశపరచగా.. జానీ బెయర్‌స్టో (0) పూర్తిగా విఫలమయ్యాడు. జోర్డాన్ హెర్మాన్ (3), జేమ్స్ కోల్స్ (1) కూడా వైఫల్యం చెందగా.. వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 68 పరుగులతో అజేయంగా నిలిచాడు.
మాథ్యూకు తోడుగా కెప్టెన్ ట్రిస్టన్ స్టబ్స్ (41 బంతుల్లో 63) ధనాధన్ దంచికొట్టాడు. వీరిద్దరు కలిసి 64 బంతుల్లో 114 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ 162 పరుగులు చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది.
ముచ్చటగా మూడోసారి
ఫైనల్లో రాణించిన డెవాల్డ్ బ్రెవిస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ ఆసాంతం ఆకట్టుకున్న డికాక్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. కాగా సౌతాఫ్రికా టీ20లీగ్‌లో సన్‌రైజర్స్‌కు తిరుగులేదు. అరంగేట్ర ఎడిషన్‌లో చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్.. ఆ మరుసటి ఏడాది కూడా టైటిల్ సాధించింది.
తాజాగా మూడోసారి ట్రోఫీ (2023, 2024, 2026)ని కైవసం చేసుకుంది. ఇప్పటికి నాలుగు సీజన్లు పూర్తి కాగా. నాలుగుసార్లు ఈ జట్టు ఫైనల్ చేరడం విశేషం. రెండుసార్లు ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలో ట్రోఫీ గెలిచిన సన్‌రైజర్స్‌కు ఇప్పుడు స్టబ్స్ టైటిల్ అందించాడు. కాగా గతేడాది ముంబై కేప్‌టౌన్ ఫైనల్లో సన్‌రైజర్స్‌ను ఓడించింది.
చదవండి: వారి వల్లే ఈ స్థాయిలో ఉన్నా: సూర్యకుమార్
It's time for that massive celebration, Coach Adi 🤩 pic.twitter.com/KssLRr7IQk
— Sunrisers Eastern Cape (@SunrisersEC) January 25, 2026


