సౌతాఫ్రికా జాతీయ జట్టు సెలెక్టర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2026 టీ20 ప్రపంచకప్ జట్టుకు పలువురు స్టార్ ప్లేయర్లను ఎంపిక చేయలేదు.
ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మెరుపు శతకంతో సత్తా చాటిన ర్యాన్ రికెల్టన్.. ఇదే లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ కెప్టెన్ అయిన ట్రిస్టన్ స్టబ్స్.. ఫాస్ట్ బౌలర్ ఓట్నీల్ బార్ట్‌మన్, విధ్వంసకర ఆటగాడు రస్సీ వాన్ డర్ డస్సెన్‌ను ప్రపంచకప్ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు.
వీరిలో డస్సెన్‌పై వేటు ఊహించిందే అయినా స్టబ్స్, రికెల్టన్, బార్ట్‌మన్‌పై వేటు మాత్రం ఎవరూ ఊహించనిది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎయిడెన్ మార్క్రమ్ ఎంపిక కాగా.. కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, జాసన్ స్మిత్ తొలిసారి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
పేసర్లు కగిసో రబాడ, లుంగి ఎంగిడి, 2024 వరల్డ్‌కప్ లీడింగ్ వికెట్‌టేకర్ అన్రిచ్ నోర్జే, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో జన్సెన్, స్పెషలిస్ట్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్, అనుభవజ్ఞులైన బ్యాటర్లు డికాక్, మిల్లర్ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు.
కాగా, ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా గ్రూప్-డిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఆఫ్ఘనిస్తాన్, కెనడా, న్యూజిలాండ్, యూఏఈ జట్లు కూడా ఉన్నాయి. మెగా టోర్నీలో గత ఎడిషన్ రన్నరప్ అయిన సౌతాఫ్రికా ఫిబ్రవరి 9న తమ తొలి మ్యాచ్ (కెనడాతో) ఆడుతుంది.
2026 టీ20 ప్రపంచకప్ కోసం సౌతాఫ్రికా జట్టు..
ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, మార్కో జన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, జాసన్ స్మిత్


