విజయ్ హజారే టోర్నీలో ఆడనున్న టీమిండియా స్టార్
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి... ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో విజృంభించిన విరాట్... న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు ఈ టోర్నీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్‌ల్లో కోహ్లి బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీలోని తొలి రెండు మ్యాచ్‌ల కోసం శుక్రవారం ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) 20 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
ఈ టీమ్‌కు భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కోహ్లి, పంత్‌తో పాటు సీనియర్ పేసర్లు ఇషాంత్ శర్మ, నవ్‌దీప్ సైనీ కూడా ఈ టోర్నీలో ఆడనున్నారు. పేస్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా అందుబాటులో ఉన్న సమయంలో టోర్నీలో పాల్గొననున్నట్లు ప్రకటించాడు. గ్రూప్ ‘డి’లో భాగంగా ఢిల్లీ జట్టు డిసెంబర్ 24 నుంచి జనవరి 8 మధ్య ఏడు మ్యాచ్‌లు ఆడనుంది.
ఆ తర్వాత జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో భారత జట్టు వన్డే సిరీస్ ఆడనుంది. దీంతో ఫామ్, ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు కోహ్లికి ఈ టోర్నమెంట్ ఉపయోగపడనుంది. ఆయుశ్ బదోనీ ఢిల్లీ జట్టు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా... యశ్ ధుల్, ప్రియాన్ష్ ఆర్య, నితీశ్ రాణా వంటి ప్రతిభావంతులు జట్టులో ఉన్నారు.
ఆరంభ మ్యాచ్‌లకు రోహిత్ దూరం
మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే, శివమ్ దూబే... విజయ్ హజారే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. యువ ఆటగాళ్లను పరీక్షించాలనే ఉద్దేశంతో స్టార్ ఆటగాళ్లను తొలి రెండు మ్యాచ్‌లకు ఎంపిక చేయడం లేదని ముంబై చీఫ్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ పేర్కొన్నాడు.
‘రోహిత్, జైస్వాల్, దూబే, రహానే కనీసం తొలి రెండు మ్యాచ్‌లకు ముంబై జట్టులో ఉండరు. సెలెక్షన్ కమిటీ యువ ఆటగాళ్లను పరీక్షించాలని భావిస్తోంది. జైస్వాల్ కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో యువకులకు అవకాశం ఇవ్వాలని భావించాం’ అని సంజయ్ వెల్లడించారు. ఈ టోర్నీ గ్రూప్ ‘సి’లో ఉన్న ముంబై జట్టు ఈ నెల 24న తొలి మ్యాచ్‌లో సిక్కీంతో తలపడనుంది.


