ఐపీఎల్-2026లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ స్పిన్నర్ విశాల్ నిషాద్ సత్తాచాటేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో నిషాద్‌ను రూ. 30 లక్షల కనీస ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన అనుభవం లేనప్పటికి అతడిపై పంజాబ్ యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది.
అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నిషాద్.. తన స్పిన్ మయాజాలంతో అందరిని ఆకట్టుకున్నాడు. 2024 యూపీ టీ20 ప్రిమియర్ లీగ్ విశాల్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ టోర్నీలో గోరఖ్‌పూర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు.. అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
గతేడాది సీజన్‌లో అతడు ఐపీఎల్‌లో ఆడుతాడని అంతా భావించారు. కానీ దురుదృష్టవశాత్తూ అప్పుడు అవకాశం లభించలేదు. అయితే ఇప్పుడు మాత్రం పంజాబ్ కింగ్స్ సువర్ణ అవకాశం కల్పించింది. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిషాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తనకు రోల్‌మోడల్ అని అతడు చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లి నాకు ఆదర్శం. అతడు ఆడే ఫియర్ లెస్ క్రికెట్, కవర్ డ్రైవ్ షాట్లు నాకెంతో ఇష్టం. ఒకవేళ నేను కోహ్లి వికెట్ తీస్తే, సెలబ్రేషన్స్ చేసుకోను. అతడు నా రోల్ మోడల్ కాబట్టి నేరుగా వెళ్లి తన పాదాలకు నమస్కరిస్తాను. నేను ఎన్నో కష్టాలు పడి ఈ స్దాయికి చేరుకున్నాను.
మా నాన్నతో పాటు పనికి వెళ్లేవాడిని. ఒకనొక సమయంలో క్రికెట్ వదిలేయాలని కూడా అనుకున్నాను. క్రికెటర్ కావడం చాలా కష్టమని, వేరే ఏదైనా వర్క్ చేసుకోమని మా అమ్మ సూచించింది. కానీ నేను మాత్రం నా ఆశయాన్ని వదులుకోలేదు. ఏదో ఒక రోజు కచ్చితంగా విజయం సాధిస్తాను అని మా అమ్మతో అన్నాను. ఆ తర్వాత నా కుటంబం కూడా సపోర్ట్ చేసింది. అందరి సహకరంతో ఇప్పుడు నా కలను నేరవేర్చుకున్నా అని 20 ఏళ్ల నిషాద్ పేర్కొన్నాడు.


