భాస్కర్‌రెడ్డిని అరెస్టుచేసి తీసుకెళ్తున్న పోలీసులు (కుడివైపు గళ్ల చొక్కా)
ముఖానికి ముసుగేసి అరికాళ్లపై తీవ్రంగా కొట్టారు
మేజి్రస్టేట్ ఎదుట వాపోయిన ఎన్‌ఆర్‌ఐ మాలేపాటి భాస్కరరెడ్డి
14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు.. నెల్లూరు జైలుకు తరలింపు
ఇద్దరు సీఐలు, ఎస్‌ఐకి షోకాజ్ నోటీసులిచ్చిన కోర్టు
విజయవాడ లీగల్/పెనమలూరు (కృష్ణా జిల్లా): ‘‘నేను ఏ తప్పూ చేయలేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానంటూ పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారు. జీపులో తిప్పుతూ, స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు’’ అని ఎన్‌ఆర్‌ఐ మాలేపాటి విజయభాస్కరరెడ్డి శుక్రవారం విజయవాడ 2వ అదనపు జ్యుడీషియల్ సివిల్ జడ్జి రాధిక ఎదుట వాపోయారు.
బల్ల మీద పడుకోబెట్టి ఛాతీపై గట్టిగా నొక్కిపట్టి అరికాళ్ల మీద తీవ్రంగా కొట్టారని... ఎస్పీనో, డీఎస్పీనో రావడంతో తన ముఖానికి ముసుగేసి, బూతులు తిడుతూ అరికాళ్లు, చేతులు, తలమీద గట్టిగా కొట్టారని తెలిపారు. బాధతో బిగ్గరగా కేకలు వేస్తున్నా జాలి చూపలేదని, స్టేషన్‌లోని అందరినీ బయటకు పంపి, ఏం చేశావో చెప్పమని అడిగారని, జరిగినది చెప్పినా, మేం చెప్పినట్లు నువ్వు వినాలని బెదిరించారని, ఇతరుల పేర్లు చెప్పాలని ఒత్తిడి చేశారని వెల్లడించారు.
సీఎం, డిప్యూటీ సీఎం, ఐటీ మంత్రి, వారి కుటుంబసభ్యులపై అసభ్య పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై చోడవరం గ్రామస్థుడు భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన పెనమలూరు పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ఈయన లండన్‌లో స్థిరపడ్డారు. వారం రోజుల క్రితం తండ్రి మరణించడంతో స్వగ్రామానికి వచ్చారు. కార్యక్రమాలు పూర్తయి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో భాస్కర్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు.
శుక్రవారం కోర్టుకు తరలిస్తున్న సమయంలో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. పోలీసులు తనను కొడుతున్న సమయంలో బాధతో అరిచిఅరిచి గొంతు పోయిందని తెలిపారు. విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేశారని, కోర్టుకు రావడానికి ముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారని, పోలీసులు కొట్టారని డాక్టర్‌కు చెప్పినా పట్టించుకోలేదని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు.
కాగా, కోర్టులో విజయభాస్కర్ రెడ్డి తరపున న్యాయవాదులు ఒగ్గు గవాస్కర్, కొప్పుల శివరామ్, ఆదాము వాదనలు వినిపించారు. ఆయనపై నమోదైన కేసులన్నీ ఏడేళ్ల లోపు శిక్ష పడేవి అని, కేసులో ఇరికించేందుకే బీఎన్‌ఎస్ 111 సెక్షన్ చేర్చారని వాదించారు. దీనిప్రకారం పదేళ్లలోపు రెండుసార్లు చార్జిïÙటు నమోదై ఉండాలన్నారు. ఆ సెక్షన్.. పిటిషనర్‌కు వర్తించదని చెప్పారు. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు.
పిటిషనర్ ఆరోగ్యం క్షీణించిందని, తక్షణం ఏదైనా ప్రైవేటు ఆసుపత్రిలోగానీ, ఎయిమ్స్‌లో గానీ వైద్యానికి అనుమతించాలని కోరారు. కాగా భాస్కరరెడ్డికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. సీఐలు జె.వెంకటరమణ, శివప్రసాద్, ఎస్‌ఐ రమేష్ కు కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భాస్కరరెడ్డికి స్పెషలిస్ట్ వైద్యులతో పరీక్షలు చేయించాలని, ఆ సమయంలో ఫొటోలు తీయాలని, నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఆదేశించింది.


