అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్ చివరి రేసులో రెడ్‌బుల్ రేసర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. 24 రేసుల సీజన్‌లో అబుదాబీ గ్రాండ్ ప్రి చివరి రేసు కాగా... శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రేసులో డిఫెండింగ్ చాంపియన్ వెర్‌స్టాపెన్ ల్యాప్‌ను 1 నిమిషం 22. 207 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును వెర్‌స్టాపెన్ ‘పోల్ పొజిషన్’ నుంచి ప్రారంభించనున్నాడు.
మెక్‌లారెన్ డ్రైవర్లు లాండో నోరిస్ 1 నిమిషం 22.408 సెకన్లు, ఆస్కార్ పియాస్ట్రి 1 నిమిషం 22.437 సెకన్లు వరుసగా రెండో, మూడో స్థానాలు దక్కించుకున్నారు. 2015 నుంచి అబుదాబి సర్క్యూట్‌లో పోల్ పొజిషన్ సాధించిన డ్రైవరే... ప్రధాన రేసులో విజేతగా నిలుస్తూ వస్తున్నాడు. మరి ఈ సారి కూడా అదే సంప్రదాయం కొనసాగుతుందా... లేక మెక్‌లారెన్ డ్రైవర్లు సత్తాచాటుతారా నేడు తేలనుంది.
ఈ సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కు ఇది ఎనిమిదో పోల్ పొజిషన్ కాగా... ఓవరాల్‌గా కెరీర్‌లో 48వది. ఈ రేస్‌తోనే డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ విజేత తేలనున్నారు. నోరిస్ 408 పాయింట్లతో రేసులో ముందుండగా... నాలుగుసార్లు చాంపియన్ వెర్‌స్టాపెన్ 396 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. పియాస్ట్రి 392 పాయింట్లతో మూడో ‘ప్లేస్’లో ఉన్నాడు. వెర్‌స్టాపెన్ రేసులో విజేతగా నిలిచినా... నోరిస్ ‘టాప్–3’లో చోటు దక్కించుకుంటే అతడికే డ్రైవర్స్ చాంపియన్íÙప్ టైటిల్ దక్కనుంది.


