సావోపాలో: క్వాలిఫయింగ్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెక్‌లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్ ఈ సీజన్‌లో ఏడో విజయాన్ని అందుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన బ్రెజిలియన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో లాండో నోరిస్ విజేతగా నిలిచాడు.
నిర్ణీత 71 ల్యాప్‌ల రేసును ‘పోల్ పొజిషన్’ నుంచి ప్రారంభించిన నోరిస్ అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 32 నిమిషాల 01.596 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
మెర్సిడెస్ డ్రైవర్ కిమి ఆంటోనెల్లి (మెర్సిడెస్) రెండో స్థానాన్ని పొందగా... డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. మెర్సిడెస్‌కు చెందిన జార్జి రసెల్‌కు నాలుగో స్థానం, మెక్‌లారెన్‌కు చెందిన ఆస్కార్ పియాస్ట్రి ఐదో స్థానం పొందారు.
ప్రపంచ మాజీ చాంపియన్, ఫెరారీ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 37 ల్యాప్‌ల తర్వాత రేసు నుంచి నిష్క్రమించగా.. చార్లెస్ లెక్‌లెర్క్ (ఫెరారీ) ఐదో ల్యాప్‌లో, గాబ్రియేల్ బొర్టోలెటో (స్టేక్ ఎఫ్1 టీమ్) తొలి ల్యాప్‌లోనే వైదొలిగారు.
రంగం సిద్ధం
తాజా విజయంతో నోరిస్ తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించేందకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ప్రస్తుతం లాండో నోరిస్ 390 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉండగా... నోరిస్ సహచరుడు పియాస్ట్రి 366 పాయింట్లతో రెండో స్థానంలో, వెర్‌స్టాపెన్ 341 పాయింట్లతో మూడో స్థానంలో, జార్జి రసెల్ 276 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రపంచ టైటిల్ నోరిస్, పియాస్ట్రి, వెర్‌స్టాపెన్‌లలో ఒక్కరికే దక్కే అవకాశముంది.
ఈ సీజన్‌లో మరో మూడు రేసులు మిగిలి ఉన్నాయి. గరిష్టంగా 75 పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. నోరిస్, పియాస్ట్రి మధ్య 24 పాయింట్ల వ్యత్యాసం... నోరిస్, వెర్‌స్టాపెన్ మధ్య 49 పాయింట్ల వ్యత్యాసం ఉంది.
ఈ నేపథ్యంలో చివరి మూడు రేసుల్లో నోరిస్, పియాస్ట్రి టాప్–10లో నిలవకుండా... వెర్‌స్టాపెన్ తప్పనిసరిగా రెండు రేసుల్లో విజేతగా నిలిచి, మరో రేసులో టాప్–10లో నిలిస్తేనే వరుసగా ఐదో ఏడాది అతని ఖాతాలో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ చేరుతుంది. సీజన్‌లోని తదుపరి మూడు రేసులు వరుసగా నవంబర్ 23న లాస్ వేగస్ గ్రాండ్‌ప్రి... నవంబర్ 30న ఖతర్ గ్రాండ్‌ప్రి... డిసెంబర్ 7న అబుదాబి గ్రాండ్‌ప్రి జరగుతాయి.


