ఫార్ములావన్ కొత్త ప్రపంచ చాంపియన్ నోరిస్ ప్రస్థానం
ఏడేళ్లప్పుడే కార్టింగ్ పిచ్చి జూనియర్ స్థాయిలో ట్రోఫీలు
మెక్‌లారెన్‌తో కల సాకారం
వేలు పట్టి నడక నేర్పించిన నాన్నే... చేయి పట్టుకొని రేసింగ్‌కు తీసుకెళ్లాడు. పిల్లలకు కిక్ ఇచ్చే గో కార్టింగ్ రేసులో రయ్ రయ్ మనిపించే తనయుని ఉత్సాహాన్ని కళ్లారా చూశాక తండ్రి తన కుమారుడి తపనే తన తపన అనుకున్నాడు. ఏడేళ్ల ప్రాయం నుంచి టీనేజ్‌కొచ్చాక ఫార్ములావన్‌లో అరంగేట్రం చేసే వరకు ప్రతి పైసా తండ్రే వెచ్చించాడు. ఇలా తండ్రి ఆడమ్ చేయూత, లాండో నోరిస్ రాతను మార్చింది. ఎఫ్1 చాంపియన్‌ను చేసింది. 
సాక్షి క్రీడా విభాగం
ఇప్పుడు ఫార్ములావన్ (ఎఫ్1) ప్రపంచ మంతా నోరిస్ వైపే చూస్తోంది. తాజా ఎఫ్1 వరల్డ్ డ్రైవర్స్ చాంపియన్‌గా అతను ఘనతకెక్కాడు. 18 ఏళ్ల తర్వాత మెక్‌లారెన్ రేసింగ్ టీమ్‌ను విజేతగా నిలిపాడు. చివరిసారిగా హామిల్టన్ 2008లో మెక్‌లారెన్‌కు టైటిల్ అందించాడు. దిగ్గజ రేసర్ హామిల్టన్, తాజా చాంపియన్ నోరిస్ ఇద్దరు బ్రిటన్ డ్రైవర్లే కావడం గమనార్హం. ఇక మెక్‌లారెన్ టీమ్‌ను కాకుండా దేశం గురించే చెప్పుకుంటే బ్రిటన్ తరఫున 11వ ఫార్ములావన్ చాంపియన్ నోరిస్. 26 ఏళ్ల వయసులో తొలి టైటిల్ సాధించాడు. ఆఖరి రేసుదాకా ఉత్కంఠ రేపినా... స్టార్ రేసర్ వెర్‌స్టాపెన్ వెనకే ఉండి (రెండో స్థానం) వెంటాడినా తను మాత్రం తక్కువేం కాదని, సర్క్యూట్‌లో దిగితే తగ్గేదే లేదని తన విజయంతో చాటి చెప్పాడు.
బాల్యంలోనే రేసింగ్ బాట
ఏడేళ్ల పసి ప్రాయంలో రేసింగ్ బాట పట్టిన నోరిస్ తాజాగా ఏడో సీజన్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలవడం విశేషం. నోరిస్ తండ్రి ఆడమ్ కోటీశ్వరుడు కావడంతో డబ్చుకు కొదవేం లేదు. పైగా ధైర్యం కూడా ఎక్కువే! లేదంటే కోట్లకు వారసుణ్ని ఏ తండ్రి అయిన ప్రమాదకర రేసింగ్‌కు తీసుకెళ్తాడా. కానీ ఆడమ్ చేయి పట్టుకొని కారులో కూర్చోబెట్టుకొని మరీ కార్టింగ్‌కు పరిచయం చేశాడు.
అలా మొదలైన ప్రయాణంలో ఓ ఏడాది గడిచేసరికే చిన్న చితక పోటీల్లో గెలవడం కూడా మొదలుపెట్టాడు. ఇలా మూడు, నాలుగేళ్లు గడిచే సరికి 11 ఏళ్ల వయసులో ‘ఎంఎస్‌ఏ బ్రిటిష్ క్యాడెట్ కార్ట్ చాంపియన్‌షిప్’లో పోటీలకు దిగాడు. మెరుపు వేగం అందిపుచ్చుకొని పలుమార్లు విజేతగా నిలిచాడు. లాండో నోరిస్ రోజు రోజుకి కాదు... కానీ రేసు రేసుకి జోరు పెంచుతున్నాడు. టీనేజ్‌లో పాల్గొన్న పోటీల్లో తన సత్తా జూనియర్ రేసింగ్ జట్లను ఆకట్టుకునేలా చేసింది. 
14 ఏళ్లకే అవార్డు కూడా...
నోరిస్‌కు బాగా తెలిసిన ప్రపంచం రేసింగ్. తనని దూసుకెళ్లేలా చేస్తున్న ప్రపంచం కూడా రేసింగే! అందుకేనేమో అతని ‘వేగం’ అంతే వేగంగా అవార్డును తెచ్చిపెట్టింది మరి! 14 ఏళ్ల టీనేజ్‌లోనే నోరిస్ తొలి అవార్డు అందుకున్నాడు. మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన సర్ జాకీ స్టివార్ట్ చేతుల మీదుగా 2013లో ఆ ఏడాదికి సంబంధించి ‘ఆటో స్పోర్ట్’ అవార్డు అందుకున్నాడు.
ఇలా అవార్డుతో పాటు ఆ రేసు, ఈ రేసు గెలుచుకుంటూ సర్క్యూట్‌పై దుమ్మురేపే ప్రతిభనే ఆలంబనగా చేసుకొని రేసర్లంతా కలలు గనే ఎఫ్1 గడప తొక్కాడు. 2018, జనవరిలో 18 ఏళ్ల నోరిస్ మెక్‌లారెన్ రేసింగ్ టీమ్ సభ్యుడయ్యాడు. టీమ్ సీఈవో బ్రౌన్ ఆ యువ రేసర్‌కు అవకాశమివ్వాలని నిర్ణయించాడు. అప్పటికే సీనియర్‌గా ఉన్న డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో స్థానంలో రేసు మొదలుపెట్టిన నోరిస్ ఆ తర్వాత కొంతకాలానికి పోల్ పొజిషన్‌లు సాధిస్తూ ముందంజ వేశాడు.
అలా ఏకబికిన ఏడేళ్ల పాటు తన టీమ్ మెక్‌లారెన్ పెట్టిన నమ్మకానికి న్యాయం చేస్తూ ఏ సీజన్‌లోనూ, ఏ రేసులోనూ నమ్మకం కోల్పోకుండా తన రేసింగ్ జోరు చూపాడు. ఎట్టకేలకు తనకు అవకాశమిచ్చిన మెక్‌లారెన్‌ను గెలిపించాడు. ఎఫ్1 అరంగేట్రం నుంచి టైటిల్ గెలిచేదాకా మెక్‌లారెన్ రేసింగ్ జట్టుతోనే తన ఏడేళ్ల పయనం మొత్తానికి ఇలా విజయవంతంగా సాగిపోతోంది.
వాడికేమో ఇష్టం, నాకేమో కష్టం
ఎవరో చెబితేనో... సరదాకో రేసింగ్‌కు వెళ్లలేదు. ఎంతో ఇష్టపడే కార్టింగ్ కార్ స్టీరింగ్ పట్టాడు. మా ఆడమ్ (నోరిస్ నాన్న) కూడా ప్రోత్సహించాడు. దీని వల్ల ఏడేళ్ల ప్రాయం నుంచి ఇప్పటి వరకు నా కుమారుడిని మిస్ అవుతూనే ఉన్నా.
మొదట్లో కార్టింగ్ అంటూ ఇంటికి దూరంగా... సర్క్యూట్‌కు దగ్గరగా ఎక్కువ సమయం గడిపాడు. అనంతరం జూనియర్ స్థాయి పోటీల కోసమని అటు ఇటూ తిరిగాడు. కొన్నేళ్లుగా ప్రొ సర్క్యూట్ రేసర్‌గా మరింత బిజీ అయిపోయాడు. ఏం చేస్తాం. వాడికేమో అదే ఇష్టం. వాణ్నిలా రోజులు, నెలల తరబడి విడిచి ఉండటం నాకేమో కష్టం.
–నోరిస్ తల్లి సిస్కా


