ఎఫ్1 డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌పై మెక్‌లారెన్ మేనేజ్‌మెంట్
నోరిస్ విజయం కోసం పియాస్ట్రితో మాట్లాడతామని వ్యాఖ్య
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసు రసవత్తరంగా మారింది. 24 రేస్‌ల సీజన్‌లో ఇప్పటి వరకు 23 రేసులు ముగియగా... పాయింట్ల పట్టికలో మెక్‌లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ 408 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. డిఫెండింగ్ చాంపియన్, రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ 396 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో మెక్‌లారెన్‌కే చెందిన ఆస్కార్ పియాస్ట్రి (392 పాయింట్లు) ఉన్నాడు.
సీజన్‌లో చివరి రేస్ అబుదాబి గ్రాండ్‌ప్రి ఈ ఆదివారం జరగనుండగా... నోరిస్ పోడియంపై నిలిస్తే అతడికే ఈ ఏడాది టైటిల్ దక్కనుంది. ఈ నేపథ్యంలో... మెక్‌లారెన్ యాజమాన్యం శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే జట్టు తరఫున ఆదేశాలిస్తామని పేర్కొంది. ‘అవును, తప్పకుండా ప్రయత్నిస్తాం. మేము ఈ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలవాలని అనుకుంటున్నాం. మా ఇద్దరు డ్రైవర్లు టైటిల్ రేసులో ఉన్నా... ఒకరికి మాత్రమే ఎక్కువ అవకాశాలున్నాయనేది సుస్పష్టం. ఇది జట్టు క్రీడ. చాంపియన్‌షిప్ సాధించేందుకు చేయగలిగినదంతా చేస్తాం. అలా చేయకపోవడం పిచ్చితనం అవుతుంది’ అని మెక్‌లారెన్ సీఈవో జాక్ బ్రౌన్ అన్నాడు.
వెర్‌స్టాపెన్ కంటే 12 పాయింట్లు ఆధిక్యంలో ఉన్న నోరిస్ సీజన్ చివరి రేసులో తొలి మూడు స్థానాల్లో నిలిస్తే చాలు టైటిల్ దక్కనుంది. ఈ నేపథ్యంలో సహచర డ్రైవర్ పియాస్ట్రిని చాంపియన్‌షిప్ గెలిచేందుకు సహకరించమని అడగలేనని నోరిస్ ఇప్పటికే పేర్కొనగా... తాజాగా జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం టైటిల్ కోసం ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటామని వెల్లడించింది. మెక్‌లారెన్ జట్టు చివరిసారిగా 2008లో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గింది.


