లాస్ వేగస్ గ్రాండ్‌ప్రి టైటిల్ కైవసం
రేసు ముగిశాక నోరిస్, ప్రియాస్ట్రిలపై అనర్హత వేటు
డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ రేసులోకి వచ్చిన రెడ్‌బుల్ డ్రైవర్
లాస్ వేగస్: ఫార్ములావన్ (ఎఫ్1) 2025 సీజన్‌లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్, నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్‌కు అదృష్టం కలిసివచ్చింది. ఈ సీజన్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయి డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో వెనుకబడిన ఈ నెదర్లాండ్స్ డ్రైవర్... ద్వితీయార్థంలో అదరగొడుతున్నాడు. తాజాగా లాస్ వేగస్ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో అతడికిది ఆరో విజయం కావడం విశేషం.
మెక్‌లారెన్ డ్రైవర్లు లాండో నోరిస్, ఆస్కార్ పియాస్ట్రి అనర్హతకు గురవడంతో... డిఫెండింగ్ చాంపియన్ వెర్‌స్టాపెన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ రేసులో దూసుకొచ్చాడు. సీజన్‌లో మరో రెండు రేసులు మాత్రమే మిగిలుండగా... చాంపియన్‌షిప్ కైవసం చేసుకునేదెవరనేది ఆసక్తికరంగా మారింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన ప్రధాన రేసులో వెర్‌స్టాపెన్ 50 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 21 నిమిషాల 8.429 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు.
తద్వారా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న మెక్‌లారెన్ డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రిని వెర్‌స్టాపెన్ సమం చేశాడు. గతేడాది ఈ రేసు ద్వారానే నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన వెర్‌స్టాపెన్... మరోసారి ఈ రేసు ద్వారానే పోటీలోకి వచ్చాడు.
తొలి మలుపులోనే...
రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన వెర్‌స్టాపెన్... తొలి మలుపులోనే రేసుపై పట్టు సాధించాడు. నోరిస్ వాయువేగంతో దూసుకెళ్తున్నా... వెర్‌స్టాపెన్ నిలకడగా ప్రయత్నిస్తూ అతడిని అధిగమించాడు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోని వెర్‌స్టాపెన్... చివరి వరకు అదే జోరు కొనసాగిస్తూ కెరీర్‌లో 69వ విజయం ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో వెర్‌స్టాపెన్ ఫాస్టెస్ట్ ల్యాప్‌ను సైతం తన పేరిట లిఖించుకున్నాడు.
నోరిస్ రెండో స్థానంతో రేసును ముగించినా... అతడిపై అనర్హత వేటు పడటంతో మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రసెల్ (1 గంట 21 నిమిషాల 31.975 సెకన్లు)కు ద్వితీయ స్థానం దక్కింది. మెర్సిడెస్‌కే చెందిన కిమీ ఆంటొనెల్లి (1 గంట 21 నిమిషాల 38.917 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు.
చార్లెస్ లెక్‌లెర్క్ (1 గంట 21 నిమిషాల 39.107 సెకన్లు; ఫెరారీ), కార్లోస్ సెయింజ్ (1 గంట 21 నిమిషాల 43.353 సెకన్లు; విలియమ్స్ రేసింగ్) వరుసగా నాలుగో, ఐదో స్థానాలు దక్కించుకున్నారు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 గంట 22 నిమిషాల 7.798 సెకన్లు; ఫెరారీ) ఎనిమిదో స్థానంలో నిలిచాడు.
ఆ ఇద్దరిపై అనర్హత వేటు ఎందుకంటే...
ఈ ఏడాది డ్రైవర్స్ చాంపియన్‌షిప్ సాధించాలని కలలు కంటున్న మెక్‌లారెన్ డ్రైవర్లకు షాక్ తగిలింది. రేసులో చక్కటి ప్రదర్శన కనబర్చిన ఆ జట్టుకు చెందిన నోరిస్ (2వ స్థానం), పియాస్ట్రి (4వ స్థానం)పై అనర్హత వేటు పడింది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న వీరిద్దరూ ప్రధాన రేసు అనంతరం తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంటారనుకుంటే... సాంకేతిక కారణాల వల్ల ఈ ఇద్దరిపై వేటు వేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
నోరిస్ కారు ప్లాంక్ పరికరాల మందం... అనుమతించిన కనీస మందం కంటే తక్కువగా ఉండటంతో అతడి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోలేదు. ఇదే కారణంగా పియా్రస్టిపై కూడా వేటు పడింది. నిబంధనల ప్రకారం దాని కనీస మందం 9 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉంది. అయితే పియాస్ట్రి నడిపిన కారు ఎల్‌హెచ్‌ఎస్ ముందు భాగం 8.96 మిల్లీమీటర్లు, ఆర్‌హెచ్‌ఎస్ ముందు భాగం 8.74 మిల్లీమీటర్లు, ఆర్‌హెచ్‌ఎస్ వెనుక భాగం 8.90 మిల్లీమిటర్లుగా ఉన్నట్లు నిర్ధారణ అయింది.
నోరిస్ కారు కూడా 9 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉన్నట్లు గుర్తించారు. తయారీ సమయంలో అత్యధికంగా 0.001 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ తేడా ఉండదని... కానీ, రేసు అనంతరం ఈ ఇద్దరి కార్లు పరిశీలించగా... అవి నిబంధనలకు లోబడి లేవని నిర్వాహకులు తేల్చారు. దీంతో నోరిస్, పియా్రస్టిపై అనర్హత వేటు విధించారు.
టైటిల్ రేసు రసవత్తరం
24 రేసుల తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 22 రేసులు ముగిశాయి. అందులో మెక్‌లారెన్ డ్రైవర్లు లాండో నోరిస్, ఆస్కార్ పియాస్ట్రి చెరో ఏడు రేసుల్లో విజయాలు సాధించగా... వెర్‌స్టాపెన్ ఆరు టైటిల్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. అయితే పాయింట్ల పరంగా చూసుకుంటే నోరిస్ 390 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో అగ్రస్థానంలో ఉండగా... పియాస్ట్రి, వెర్‌స్టాపెన్ చెరో 366 పాయింట్లతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నారు.
‘టాప్’లో ఉన్న నోరిస్‌కు... వెర్‌స్టాపెన్‌కు మధ్య 24 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఈ సీజన్‌లో మరో రెండు రేసులు మిగిలి ఉన్నాయి. గరిష్టంగా 50 పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. చివరి రెండు రేసుల్లో నోరిస్ టాప్–10లో నిలవకుండా... వెర్‌స్టాపెన్ టైటిల్ గెలిస్తే వరుసగా ఐదో ఏడాది అతని ఖాతాలో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ అతడికే దక్కుతుంది. సీజన్‌లోని తదుపరి రెండు రేసులు వరుసగా ఈ నెల 30న ఖతర్ గ్రాండ్‌ప్రి... డిసెంబర్ 7న అబుదాబి గ్రాండ్‌ప్రి జరుగుతాయి.


