చెన్నై: సొంతగడ్డపై భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు తమ సత్తా చాటుకుంది. అండర్–21 ప్రపంచకప్‌లో వరుసగా నాలుగోసారి టీమిండియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ‘షూటౌట్’లో 4–3 గోల్స్ తేడాతో బెల్జియం జట్టును ఓడించి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. నిర్ణీత సమయంలో రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున కెప్టెన్ రోహిత్ (45వ నిమిషంలో), శార్దానంద్ తివారి (48వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
బెల్జియం జట్టుకు గాస్పర్డ్ కార్నెజ్ (11వ నిమిషంలో), నాథన్ రొగె (59వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. విజేతను నిర్ణయించే ‘షూటౌట్’లో భారత గోల్‌కీపర్ ప్రిన్స్ దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. బెల్జియం జట్టుకు చెందిన రెండు పెనాల్టీ స్ట్రోక్‌లను నిలువరించి భారత్‌ను గెలిపించాడు. ‘షూటౌట్’లో భారత్ తొలి మూడు పెనాల్టీ స్ట్రోక్‌లను శార్దానంద్ తివారినే తీసుకొని మూడింటిని గోల్స్‌గా మలిచాడు. మరోవైపు బెల్జియం తరఫున తొలి మూడు పెనాల్టీ స్ట్రోక్‌లను హుగో లబుచెరి, గుర్లెయిన్, చార్లెస్ గోల్స్‌గా మలిచారు.
భారత్ తరఫున నాలుగో పెనాల్టీ స్ట్రోక్‌లో మన్‌మీత్ సింగ్... బెల్జియం తరఫున నాథన్ రొగె విఫలమయ్యారు. భారత్ తరఫున ఐదో పెనాల్టీ స్ట్రోక్‌ను అంకిత్ పాల్ లక్ష్యానికి చేర్చగా... బెల్జియం ప్లేయర్ నికోలస్ పెనాల్టీ స్ట్రోక్‌ను భారత గోల్‌కీపర్ ప్రిన్స్ దీప్ అడ్డుకోవడంతో టీమిండియా విజయం ఖాయమైంది. ఆదివారం జరిగే సెమీఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీతో భారత్; అర్జెంటీనాతో స్పెయిన్ తలపడతాయి.


