చిన్న వయసులోనే సైన్స్ పుస్తకాలను ‘చందమామ’ పుస్తకాలలాగా ఆసక్తిగా చదివేవాడు బెల్జియంకు చెందిన లారెంట్. శాస్త్రీయ విషయాలపై అతడి ఆసక్తి ఊరకే పోలేదు. ‘బెల్జియం ఐన్‌స్టీన్’ ‘లిటిల్ ఐన్‌స్టీన్’గా తనను పిలుచుకునేలా చేసింది!
పదిహేను సంవత్సరాల లారెంట్ సైమన్స్ బెల్జియంలోని ఆంబ్వెర్ప్ విశ్వవిద్యాలయంలో క్వాంటం ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సూపర్‌ఫ్లూయిడ్, సూపర్ సాలిడ్ సిస్టమ్‌లలో బోస్ పోలరాన్‌ల వంటి సంక్లిష్ట అధ్యయన అంశాలపై లారెంట్ పరిశోధన సాగింది. నిజానికి ఈ సంక్లిష్ట అంశాలను అర్థం చేసుకోవడానికి అతడి వయసు సరిపోదు.
అయినా సరే, అవలీలగా పీహెచ్‌డీ పూర్తి చేసి భేష్ అనిపించుకుంటున్నాడు. పన్నెండు సంవత్సరాల వయసులోనే బోసాన్లు, బ్లాక్ హోల్స్‌లాంటి అంశాలపై ఆసక్తి పెంచుకున్నాడు. అధ్యయనం ప్రారంభించాడు. ‘అధునాతన శాస్త్రీయ, సాంకేతిక విషయాలపై ఆసక్తి ఉన్న, అసాధారణ దృష్టి ఉన్న పిల్లవాడు’ అని లారెంట్ గురించి ప్రశంసిస్తారు ఉపాధ్యాయులు. లారెంట్‌కు ఫొటోగ్రాఫిక్ మెమోరీ(అసాధారణ జ్ఞాపకశక్తి), 145 ఐక్యూ ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ జనాభాలో కొద్దిమంది మాత్రమే ఆ స్థాయిలో స్కోర్ చేస్తారు.
చిన్న వయసులోనే లారెంట్‌లోని టాలెంట్‌ను గ్రహించిన తల్లిదండ్రులు ప్రోత్సహించడం ప్రారంభించారు. ‘మేము ఊహించిన దాని కంటే ఎక్కువగా చదువులో రాణిస్తున్నాడు’ అని లారెంట్ గురించి సంతోషంగా చెబుతుంటారు తల్లిదండ్రులు. చిన్న వయసులోనే క్వాంటమ్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు లారెంట్. టెక్ కంపెనీలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీలు, రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు అతడిపై ఆసక్తి చూపిస్తున్నాయి.
తన పీహెచ్‌డీ వార్తను లారెంట్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంస పూర్వకమైన సందేశాలు వచ్చాయి. ‘చదువు ముఖ్యమే అయినా వ్యక్తిగత జీవితాన్ని మిస్ కాకూడదు. విద్యాజీవితం వ్యక్తిగత జీవితాన్ని కప్పివేయకూడదు. అతడు రెండు వైపులా బాగుండాలి’ అని కుమారుడి గురించి చెబుతున్నారు తల్లిదండ్రులు.
లారెంట్ పదకొండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తాత,మామ చనిపోయారు. చాలా బాధ పడ్డాడు. ‘ఆరోజు నుంచి మానవ జీవితం పొడిగించడం గురించి ఆలోచించడం ప్రారంభించాను’ అంటాడు లారెంట్. భవిష్యత్‌లో మానవ జీవితాన్ని పొడిగించడానికి లారెంట్ అసాధారణ ఆవిష్కరణ చేస్తాడేమో! పీహెచ్‌డీ తరువాత సెకండ్ డాక్టోరల్ ప్రోగ్రామ్ కోసం లారెంట్ మ్యూనిచ్ వెళ్లాడు. వైద్యశాస్త్రంలో అతడి కొత్త రిసెర్చ్ ట్రాక్ కృత్రిమ మేధస్సుపై దృష్టి పెడుతుంది. తన భవిష్యత్ లక్ష్యానికి ఇది ఉపకరిస్తుందని చెబుతున్నాడు
భవిష్యత్ లక్ష్యం
పీహెచ్‌డీ పూర్తి చేసిన తరువాత ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న అభినందనలు నాకు సంతోషాన్ని ఇచ్చాయి. శాస్త్రీయ అంశాలపై మరింత ఆసక్తి పెంచడానికి ఈ ప్రోత్సాహం నాకు ఉపకరిస్తుంది. భవిష్యత్తులో ప్రజలు ఎక్కువ కాలం, ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి సహాయపడే వైద్యశాస్త్రాన్ని అధ్యయనం చేయాలనుకుంటున్నాను.
– లారెంట్
ఆరోజుల్లోనే!
సాధించింది గొప్ప విజయమే అయినప్పటికీ డాక్టరేట్ పొందిన అతి పిన్న వయస్కుడు లారెంట్ కాదు. 1814లో పదమూడు సంవత్సరాల వయసులో జర్మన్ డిజీ కార్ల్ విట్టీ హీహెచ్‌డీ చేశాడు. ఇటీవలి కాలంలో కార్పన్ హ్యూయ్–యు 21 సంవత్సరాల వయసులో భౌతికశాస్త్రంలో పీహెచ్‌డీ సాధించాడు. రెండు సంవత్సరాల వయసు నుంచే ఇతడు సైన్స్ పుస్తకాలను చదవడం మొదలు పెట్టాడు.
(చదవండి: కంటెంట్ క్రియేటర్ అవ్వడం కోసం..రూ. 15 కోట్ల కంపెనీని అమ్మేశాడు..!)


