కొద్దిగా... వెచ్చగా | Winter Impact on Digestive Health, Tips and Seasonal Remedies | Sakshi
Sakshi News home page

కొద్దిగా... వెచ్చగా

Dec 5 2025 5:03 AM | Updated on Dec 5 2025 5:03 AM

Winter Impact on Digestive Health, Tips and Seasonal Remedies

ఫుడ్‌ & ఫ్యాషన్‌

మిగతా కాలాలతో పోల్చితే చలికాలం నోటికి విభిన్న రకాల రుచులను అందించాలనుకుంటాం. నచ్చిన ఫుడ్‌ని కర కర నమిలివేయాలనుకుంటాం.  వేడి వేడి పానీయాలు ఓ వైపు.. వివిధ రకాల స్నాక్స్, వేయించిన పదార్ధాలు మరో వైపు.. ఈ కాలంలో  సహజంగా కలిగే ఆహార కోరికల జాబితా ఎక్కువే.  అవన్నీ అనారోగ్యానికి దారితీసేవి.. జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచే సే పదార్థాలపై  దృష్టి ఎంత వరకు, ఎందుకు అవసరమో  ఈ వింటర్‌ స్పెషల్‌ గురించి నిపుణులు  సూచనలు తప్పనిసరి.

బాగా వేయించిన స్నాక్స్‌ని మరో ఆలోచన లేకుండా హ్యాపీగా తినేస్తుంటాం. ఇంకా మరిన్ని వేయించిన స్నాక్స్‌ కావాలనుకుంటాం కూడా. ఈ సీజన్‌లోనే ఇలాంటి ఆలోచనలు ఎక్కువ. అందుకని, మన జిహ్వపై మనం అదుపు సాధిస్తూ, ఆరోగ్యకరమైన మార్గాలపై దృష్టి సారించాలని లైఫ్‌స్టైల్‌ కోచ్‌ నిధి నహత సూచిస్తున్నారు.

కాఫీతో కాకుండా స్మూతీతో ప్రారంభం
చాలా మందికి ఉదయం పూట డీహైడ్రేషన్‌ వల్ల ఆకలిగా అనిపిస్తుంది. అందుకని కాఫీ, టీలకు బదులు ఆరోగ్యకరమైన స్మూతీతో రోజును ప్రారంభించాలి. బాదం పాలు, అరటిపండు, తాజా పాలకూర, కొద్దిగా అవిసె గింజల పొడి వేసి, మిక్సర్‌ జార్‌లో గ్రైండ్‌ చేసుకొని, తాగాలి. ఈ మిశ్రమం కొన్ని గంటల పాటు కడుపును నిండుగా ఉంచుతుంది. శక్తిమంతం చేస్తుంది. ఉదయం అంతా రక్తంలో చక్కెర స్థాయులను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉదయపు చలికి పానీయం ఎలా సేవిస్తాం.. అనుకునేవారు గోరువెచ్చని ఓట్‌ మిల్క్‌ను స్మూతీ బేస్‌గా ఉపయోగించి ప్రయత్నించవచ్చు.

రోస్ట్‌ బెస్ట్‌... డీప్‌ ఫ్రై  వరస్ట్‌
తినడానికి వేయించిన స్నాక్స్‌ బదులుగా, కాల్చిన వాటిని తినడానికి ఎంచుకోవాలి. కాల్చిన బఠాణీ, మఖానా, వేరుశెనగలు వంటి క్రిస్పీ, ఆరోగ్యకరమైన స్నాక్స్‌ మంచి ఎంపికలు. మరింత రుచి కోసం సముద్రపు ఉప్పు, పసుపు వంటివి జోడించవచ్చు. గింజలు తినడం ఇష్టపడకపోతే వాటి బదులుగా ఉడికించిన ఉసిరికాయ, మొలకెత్తిన గింజలు.. వంటివి ఉపయోగించవచ్చు.

వేడి వేడి సలాడ్లు
సలాడ్ల గురించి ఆలోచించినప్పుడు ఆకుకూరలు ఆలోచనలోకి రావాలి. ఈ సీజన్  లో వేడి సలాడ్‌లను తీసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. పప్పులు, చిరుధాన్యాలు ఉడికించి, ఆలివ్‌ లేదా నువ్వుల నూనె వేసి, కూరగాయలతో కలిపి వంటకం తయారు చేసుకోవచ్చు. చల్లగా ఉండే ఈ సీజన్‌లో శరీరానికి అవసరమైన పోషకాలను కూడా ఇవి ఇస్తాయి. అయితే వీటిని వేగంగా కాకుండా నెమ్మదిగా తినడానికి ప్రయత్నించాలి. పోషకాహారం తయారీలోనూ, తినడంలోనూ సమయాన్ని కేటాయించినప్పుడు దాని వల్ల లభించే ఆనందాన్ని కూడా పొందాలి. అప్పుడే ఆ ఆహారం జీర్ణక్రియ పనితీరు సక్రమంగా ఉండటానికి సహాయపడు
తుంది.

స్నాక్స్‌కు మసాలా దినుసులు
జీలకర్ర, దాల్చినచెక్క, అల్లం, వాము, శొంఠి.. వంటి శీతాకాలపు సుగంధ ద్రవ్యాలతో చిరుతిండిని మెరుగుపరుచుకోవాలి. ఈ సుగంధ ద్రవ్యాలు భోజనాన్ని రుచికరంగా మార్చడమే కాకుండా మన జీవక్రియను మెరుగు పరచడంలో, శీతాకాలం అతిగా తినాలనే కోరికను తగ్గించడంలోనూ  సహాయపడతాయి. మసాలా దినుసులు సరిపడవు అనకునేవారు వాటి బదులుగా పుదీనా, తులసి లేదా కొత్తిమీర వంటి వాటిని ఉపయోగించవచ్చు.

ఫైబర్‌ ఫుడ్‌
తక్కువ ఫైబర్‌ ఉన్న ఆహారం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు హెచ్చుతగ్గులకు గురవుతాయి. దీనివల్ల సాయంత్రం వేళల్లో ఎక్కువసేపు తినాలనే కోరిక పెరుగుతుంది. దీన్ని నివారించడానికి, అధిక ఫైబర్‌ ఉన్న ఆహారాలను తినడానికి ప్రయత్నించాలి. క్యారెట్, బీట్‌రూట్‌ వంటి కూరగాయల ముక్కలు వెన్నతో, పండ్ల ముక్కలు తినడం మంచిది. ఈ స్నాక్స్‌ రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడంతో పాటు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించడంలో సహాయపడతాయి. జీర్ణ సమస్యలు ఉంటే,  అసౌకర్యాన్ని నివారించడానికి ఫైబర్‌ ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది.

భావోద్వేగాల బ్యాలెన్స్‌
చలి కాలం భావోద్వేగపరంగా సమస్యలను ఎదుర్కోవడం సహజం. దీంతో తరచూ ఆకలిగా అనిపిస్తుంది. ఒంటరిగా లేదా ఒత్తిడికి గురవుతున్నట్టు అనిపించి పదే పదే స్నాక్స్‌ తీసుకుంటారు. తినాలనే కోరిక అనిపించినప్పుడు, ‘నేను నిజంగా దేని కోసం ఆకలిగా ఉన్నాను?‘ అని తమని తాము ప్రశ్నించుకోవాలి. స్నేహితులతో మాట్లాడటం, ధ్యానం చేయడం లేదా వేగంగా నడవడం వంటివి చిరుతిండిని తినాలనే ధ్యాసను మళ్లించడంలో ఎక్కువ సహాయపడతాయి.

కాలానుగుణంగా లభించే పండ్లు
చలికాలంలో నారింజ, జామపండ్లు, దానిమ్మ వంటి విటమిన్‌– సి అధికంగా ఉండేవి ఈ కాలంలో మనకు విరివిగా లభిస్తాయి. ఈ పండ్లు తీపి తినాలనే కోరికను తీర్చుతాయి. మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శీతాకాలపు జలుబులను నివారించడానికి సహాయపడతాయి. మనకు ఏవి అవసరమో ప్రకృతి వాటినే మనకు అందిస్తుందని గుర్తించాలి. ఉసిరి తినలేకపోతే మరేమైనా పుల్లని పండ్లు తినొచ్చు.  

’ హెర్బల్‌ టీ మేలు
చల్లగా ఉండే వాతావరణంలో నీళ్లు తక్కువ తాగుతుంటారు చాలా వరకు. వేడి కోసం టీ లు కూడా ఎక్కువ సేవిస్తుంటారు. దీని బదులుగా దాల్చిన చెక్క లేదా తులసి, అల్లం.. వంటి మూలికలతో టీ చేసి, తాగడం వల్ల అవి శరీరాన్ని వెచ్చగా, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఈ మూలికలతో వ్యతిరేక ప్రభావం చూపే, మందులను తీసుకుంటే ముందుగా వైద్య నిపుణులతో చర్చించాలి.

నిద్ర కోసం సూర్యరశ్మి
తగినంత సూర్యరశ్మి శరీరానికి తగలకపోయినా, సరైన నిద్ర పోకపోయినా తీవ్రమైన కార్బోహైడ్రేట్‌ విడుదలై తినాలనే కోరికలకు దారితీస్తుంది. ప్రతి రాత్రి కనీసం ఏడు గంటలు మంచి నిద్ర పొందడానికి ప్రయత్నించాలి. ఉదయం 15 నిమిషాలు సూర్యరశ్మి శరీరాన్ని తాకేలా చూసుకోవాలి. ఈ సాధారణ అలవాట్లు అతిగా తినాలనే కోరికలను తగ్గించడంలో, మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. హార్మోన్లు సక్రమంగా పని చేస్తాయి.

మీవైన స్నాక్స్‌ ప్లానింగ్‌! 
కాల్చిన గింజలు, ఖర్జూరం, పండ్లు ఇంట్లో తయారుచేసిన ఎనర్జీ లడ్డూలు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తీసుకోవాలి. తినాలనే కోరిక పెరిగినప్పుడు ప్రాసెస్‌ చేసిన జంక్‌ ఫుడ్‌ను నివారించడానికి ఇది సహాయపడుతుంది. చురుగ్గా ఉండటం ద్వారా సక్సెస్‌ కోసం తమని తాము సిద్ధం చేసుకోవచ్చు. 

చలికి స్వెటర్‌ ధరించడం అంటే మొత్తం ముసుగు వేసిట్టే అని, చబ్బీగా కనిపిస్తామని ఆందోళన చెందుతారు ఫిట్‌ అండ్‌ స్లిమ్‌గా ఉండాలనుకునేవారు. టర్టిల్‌ నెక్, లాంగ్‌ స్లీవ్స్, హాఫ్‌ జాకెట్‌ అంటూ స్వెటర్లలో నేడు చాలా మోడల్స్‌ వచ్చాయి. స్టైలిస్ట్, ఇమేజ్‌ కోచ్‌ ఆషి వర్మ స్వెటర్‌ ఎంపికల గురించి ఇచ్చిన సమాచారం ఈ సీజన్‌ని మరింత బ్రైట్‌గా, వెచ్చగా ఉంచుతుంది.

కొన్ని డ్రెస్సుల్లో సన్నగా, మరికొన్ని డ్రెస్సుల్లో బొద్దుగా కనిపిస్తుంటారు కొందరు. ఇదంతా నెక్‌లైన్‌ బట్టే ఉంటుంది. ఇక ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు బెల్లీ ఫ్యాట్‌ సమస్యతో బాధపడుతున్నారు. ఏ డ్రెస్‌ ధరించినా ఫోకస్‌ బెల్లీ ఫ్యాట్‌పైనే ఉంటుంది. ఇక, ఈ చలికాలం స్వెట్టర్లు ధరించడం వల్ల ఇంకా బొద్దుగా కనిపిస్తారు. స్వెటర్‌లోనూ ఫిట్‌గా, బ్రైట్‌గా కనిపించాలంటే...

నెక్‌ లైన్‌
∙టాప్స్, బ్లౌజ్‌ల విషయంలోనే కాదు బొద్దుగా కనిపించడంలో స్వెటర్‌ నెక్‌లైన్‌ నిర్ణయిస్తుంది. అందుకే రౌండ్‌ నెక్‌ లేదా టర్టిల్‌ నెక్‌ స్వెటర్లను 
ఎంచుకోకూడదు. ఇవి ఛాతీ ఏరియాను ఎక్కువ ఫోకస్‌ చేస్తాయి. దీంతో.. బరువు పెరిగినట్టు కనిపిస్తారు. వీటిబదులు వి– నెక్‌ స్వెటర్‌ లేదా రాప్‌–స్టైల్‌ కోటు అయితే మంచి ఆప్షన్‌.

హాఫ్‌ స్లీవ్స్‌
∙వింటర్‌ వేర్‌ షర్టులు, డ్రెస్సులు, టర్టిల్‌నెక్‌లతో సులభంగా స్టైల్‌ చేయగలవి, మహిళలకు ఉత్తమమైనవి స్లీవ్, హాఫ్‌ స్వెటర్‌ లు. ఇవి, చలికాలానికి అనువైనవిగా, వెచ్చదనంతో ఉండచ్చు. హాఫ్‌ స్వెటర్ల వల్ల బొద్దుగా కనిపించరు. 
∙హాఫ్‌ స్లీవ్‌ స్వెటర్లను షర్టులు, టర్టిల్‌నెక్, శారీస్‌.. వంటి ఇతర దుస్తులతో కూడా జత చేయవచ్చు. ఈ స్వెటర్ల వల్ల మొత్తం కప్పుకున్న విధంగా కాకుండా తేలికైన అనుభూతినిస్తాయి. విహారయాత్రలు, ఆరుబయట జరిగే మీటింగ్స్‌కి కూడా వీటిని సులభంగా ధరించవచ్చు. 
∙ఫ్రంట్‌లో పెద్ద బటన్లు, వి–నెక్‌ ప్యాటర్న్‌తో కార్డిగాన్‌ స్టైల్‌ డిజైన్  ను అందిస్తున్న ఈ స్వెటర్‌ రెగ్యులర్‌ ఫిట్‌తో ఉంటుంది. సౌలభ్యం కోసం రెండువైపులా సైడ్‌ ఫ్రంట్‌ పాకెట్‌లు ఉన్నవి ఎంచుకోవచ్చు. ఈ హాఫ్‌ స్వెటర్‌ను షర్టులు,హై–నెక్‌  డ్రెస్సులు, వెస్ట్రన్‌ లేదా ఎథ్నిక్‌ అవుట్‌ఫిట్‌లపై కూడా ధరించవచ్చు.

రౌండ్‌ నెక్‌ – హాఫ్‌ జిపర్‌
∙సౌకర్యం, రక్షణ కోసం స్ప్రెడ్‌ కాలర్‌ ఉండే క్లాసిక్‌ డిజైన్‌తో ఉంటుంది. లాంగ్‌ టూర్లు, మరీ చలిగా ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు వీటిని ఎంచుకోవచ్చు. ∙స్వెటర్‌ సెట్స్‌లో టాప్‌ అండ్‌ బాటమ్స్‌ తో ఉన్నవీ వస్తున్నాయి. వీటిలో ఒకే రంగులో ఉండే స్వెటర్‌ టాప్, ట్రౌజర్‌తో స్టైల్‌ చేయవచ్చు. ∙ప్యాటర్న్‌ స్వెటర్‌ వేసినప్పుడు ఫుట్‌వేర్, ఇతర అలంకరణలో మినిమలైజ్‌ను పాటించాలి.

వి నెక్‌ – ఓవర్‌ సైజ్‌
∙వి–నెక్‌ స్వెటర్‌ను షర్టులు, కుర్తాలు, చీరలపై కూడా స్టైల్‌ చేయవచ్చు. సరైన ఫిట్‌తో వి–నెక్‌ ప్యాటర్న్, రిబ్బెడ్‌ హెమ్‌ను అందించే వింటర్‌ వేర్‌ వార్డ్‌రోబ్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే. ∙రిలాక్స్‌డ్‌ స్వెటర్లు అంటే ఓవర్‌ సైజ్‌తో ఉండేవి. ఈ సీజన్‌లో ఓవర్‌సైజ్‌ కూడా ఫ్యాషన్‌ కాబట్టి, ఇవి స్టైలిష్‌గా కనిపిస్తాయి. షార్ట్స్‌ మీదకు, టైట్‌ బాటమ్స్‌కి ఈ ఓవర్‌సైజ్డ్‌ స్వెటర్లు బాగుంటాయి.

కలర్‌ కాంబినేషన్స్‌
∙ స్వెటర్‌ అనగానే మనకు చాలావరకు ప్లెయిన్‌గా ఒకే రంగులో ఉండేవి కనిపిస్తాయి. కానీ, ఇటీవల వీటిలో కలర్‌ కాంబినేషన్స్, ప్రింట్లు, వివిధ మోడల్స్‌లో వస్తున్నాయి.
∙ చాకొలెట్, బ్రౌన్, బ్లాక్, వైట్, న్యూట్రల్‌ టోన్స్‌తో ఉండే స్వెటర్లు రిచ్‌లుక్‌నిస్తాయి. 
వాతావరణం మరీ చల్లగా ఉంటే వి నెక్‌ స్వెటర్‌తో పాటు ఉలెన్‌ స్టోల్‌ ధరిస్తే ఫ్యాషనబుల్‌గా కనిపిస్తారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement