పరిశోధన విద్యలో అద్భుత పురోగతి
పీహెచ్‌డీలు, ప్రచురణలు, పేటెంట్ల గణాంకాల అప్‌ట్రెండ్
అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో 60% పీహెచ్‌డీ అర్హత కలిగిన అధ్యాపకులు
కేపీఎంజీ అధ్యయనం వెల్లడి
పరిశోధక విద్య విషయంలో దేశం గణనీయమైన పురోగతి సాధిస్తోంది. ఆరేళ్లలో విశ్వవిద్యాలయాల పీహెచ్‌డీ ప్రవేశాల్లో ఏకంగా 21శాతం వృద్ధి కనిపిస్తోంది. అంటే 2019లో 97,947 ప్రవేశాల నుంచి 2025లో 1,18,556కి చేరుకుంది. ఇక పీహెచ్‌డీల సమర్పణ, అవార్డుల స్వీకరణ 49 శాతం పెరిగి 24,481కి ఎగబాకింది. వీటి ఫలితంగా పరిశోధన ప్రచురణలు మూడు రెట్లు వేగాన్ని సాధించి పేటెంట్ల సంఖ్య పెరుగుదలలో తోడ్పాటును అందిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) పదేళ్ల డేటా ఆధారంగా ప్రముఖ సర్వీస్ నెట్‌వర్క్ సంస్థ– కేపీఎంజీ చేసిన అధ్యయనంలో వెల్లడైన పలు ఆసక్తికరమైన అంశాలు ఇవీ... – సాక్షి, అమరావతి
ప్రపంచ వాటా పెరుగుదల
పరిశోధన కోసం దశాబ్ద కాలంగా సాగిస్తున్న కృషి పేటెంట్ల సంఖ్య పెరుగుదలతో స్పష్టంగా కనిపిస్తోంది. 2018–25 మధ్య విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ సంస్థల ప్రచురణ వాల్యూమ్స్ 150 శాతం, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌లో 300 శాతం వృద్ధి చెందాయి. ఈ కాలంలోనే ప్రపంచ పరిశోధన ప్రచురణలలో భారతదేశ వాటా 3.5 శాతం నుంచి 5.2 శాతానికి దూసుకెళ్లింది. ఉన్నత విద్యా సంస్థల్లో పీహెచ్‌డీ అర్హత కలిగిన అధ్యాపకుల నేతృత్వంలో బోధన శాతం గణనీయంగా పెరిగింది. దీనితో దేశీయంగా పీహెచ్‌డీ ప్రవేశాలు, అవార్డుల స్వీకరణ గణాంకాలు గణనీయంగా పెరిగాయి.
విద్యా నైపుణ్యం, బోధన నాణ్యతకు ప్రాధాన్యం..
దేశంలోని అగ్రశ్రేణి సంస్థల్లో దాదాపు 60% పీహెచ్‌డీ అర్హత కలిగిన అధ్యాపకులు బోధన సాగిస్తున్నారు. తద్వారా పరిశోధన, విద్యా నైపుణ్యం, బోధనా నాణ్యతకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఇక్కడ దేశంలోని టాప్ 100 ఉన్నత విద్యా సంస్థలలో పీహెచ్‌డీ అర్హత కలిగిన అధ్యాపకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మేనేజ్‌మెంట్ సంస్థలలో 90 శాతానికి పైగా, ఇంజనీరింగ్ కళాశాలల్లో 80 శాతానికి పైగా పీహెచ్‌డీ అర్హత కలిగిన వారితో విద్యా బోధన కొనసాగుతోంది. కొన్ని అగ్రశ్రేణి సంస్థల్లోని వివిధ విభాగాల్లో 73 శాతానికి పైగా పీహెచ్‌డీ–అర్హత కలిగిన అధ్యాపకుల నియామకం కనిపిస్తోంది.
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్ నిలువుటద్దం..
⇒ దేశంలో ఏటా ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో దరఖాస్తు చేసుకునే విద్యాసంస్థల సంఖ్య పెరుగుతుండడం విశ్వవిద్యాలయం, ఉన్నత విద్యా సంస్థల బోధన నాణ్యత, వాటి సామర్థ్యానికి నిలువుటద్దం.
⇒ ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో దరఖాస్తు చేసుకునే విద్యాసంస్థల సంఖ్య 2016లో 2,426 కాగా, 2025 నాటికి 217 శాతం పెరిగి 7,692కి చేరింది.
⇒ ఇక కళాశాలల విభాగంలో 401 శాతం అంటే 803 నుంచి 4,030వరకు సంస్థలు ర్యాంకుల కోసం పోటీపడే పరిస్థితి వచ్చింది.
⇒ ర్యాంకింగ్స్ విషయంలో ఐఐఎస్‌సీ బెంగళూరు, జేఎన్‌యూ, ఐఐటీ మద్రాస్ వంటి ప్రభుత్వ సంస్థల ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక ఈ విషయంలో ప్రైవేటు వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది.
⇒ విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాలకు సంబంధించి ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులతో పాటు క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కీలకం. ఈ విషయంలో తాజాగా భారత్ 54 సంస్థలతో నాల్గవ అత్యధిక ప్రాతినిధ్యం కలిగిన దేశంగా అవతరించింది.


