సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలంలో చిరుతపులి కలకలం సృష్టించింది. అర్ధరాత్రి ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించింది. పాతాళ గంగ మెట్ల మార్గంలోని ఓ ఇంటి ప్రాంగణంలోకి చిరుతపులి వచ్చింది. సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం సిబ్బంది. అప్రమత్తమయ్యారు. పుణ్య స్నానాలకు వెళ్ళే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా అధికారులు అనౌన్స్ చేయిస్తున్నారు.
నల్లమలలో 87 పెద్ద పులులు
నల్లమల అడవుల్లో ప్రస్తుతం 87 పెద్దపులులు ఉన్నట్లు ఎన్‌ఎస్‌టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. మహానందిలోని అటవీ పర్యావరణ కేంద్రాన్ని గురువారం పునఃప్రారంభించారు. అలాగే శ్రీకామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామివారిని దర్శించుకొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నల్లమలలో ప్రస్తుతం 87పెద్ద పులులు ఉండగా త్వరలో పులుల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు.
మహానందిలోని అటవీ పర్యావరణ కేంద్రాన్ని గతంలో మహానందీశ్వరస్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు, పర్యాటకులు సందర్శించేవారని, అనివార్యకారణాలతో ప్రవేశం నిలిపేసినట్లు తెలిపారు. గురువారంనుంచి అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పర్యాటకులు ఉచితంగా పర్యావరణ కేంద్రాన్ని సందర్శించవచ్చునన్నారు. అటవీ జంతువులపై అవగాహన కల్పించేలా చిత్రాలు ఏర్పాటు చేశామన్నారు.


