సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్, ఇంకొందరు మంత్రులు గత కొన్ని రోజులుగా ప్రజలకు, మీడియాకు అందుబాటులో లేరు. నాలుగు రోజులుగా వీరి పర్యటనలపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు రేకెత్తిస్తోంది.
కూటమి పార్టీల అనుకూల మీడియా వర్గాలు చంద్రబాబు విదేశాలకు వెళ్లారని చెబుతున్నప్పటికీ, ఆయన ఏ దేశంలో ఉన్నారు, ఎందుకు వెళ్లారు అనే విషయంపై అధికారికంగా టీడీపీ నోరు మెదపడం లేదు. ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్‌ది కూడా. ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారన్నది స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో చర్చలు మరింత వేడెక్కుతున్నాయి. ఇటు పవన్ కల్యాణ్ తన శాఖలకు సంబంధించిన ఏదో మొక్కుబడి ప్రకటన చేశారే తప్ప.. అధికార వర్గాలతో టచ్‌లో లేరని సమాచారం. అయితే అనూహ్యంగా ఆయన కొత్త సినిమా ప్రకటన మాత్రం చేశారు.
వారం రోజుల క్రితమే నారా లోకేష్ కూడా గాయబ్ అయ్యారు. ఆయన కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదు. అఫ్‌కోర్స్.. ఇది మొదటి నుంచి ఉండేదే. అయితే ఇప్పుడు కొత్తగా.. ఇతర మంత్రులు కూడా ముఖ్య నేతల బాటలోనే అజ్ఞాతంగా వెళ్లిపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ పెద్దలు ఉన్నపళంగా రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అనేక ససమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమయంలో, ముఖ్య నేతలు కనిపించకపోవడం ప్రజలకు అసహనాన్ని కలిగిస్తోంది. మరోవైపు, ప్రభుత్వ పెద్దల పర్యటనలపై జారీ చేసిన జీవోలను కూడా రహస్యంగా ఉంచడం, అధికారిక ప్రకటనలు ఇవ్వకపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది.
కొత్త సంవత్సరం సందర్భంగా.. ప్రజలకు సోషల్ మీడియాలో, పార్టీ తరఫున ప్రకటనల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు కూటమి పెద్దలు. అయితే ప్రభుత్వపరంగా.. పాలనాపరంగా ఈ ఏడాదికి సంబంధించిన కీలక సమీక్షల నిర్వహణ, నిర్ణయాలు తీసుకోవాల్సిన టైంలో ఉన్నపళంగా వాళ్లు రాష్టం నుంచి గాయబ్ కావడం హాట్ టాపిక్‌గా మారింది.
వ్యక్తిగత జీవితాలను సమయం కేటాయించడం తప్పు కాకపోయినా.. దానికంటూ ఓ లిమిట్ ఉంటుందని కొందరు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఉన్నపళంగా ఒక్కసారిగా అంతా ఒక్కసారి మాయం కావడం వెనుక అసలు కారణం ఏమిటి, వారు ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు.


