ఇద్దరు కానిస్టేబుళ్లు తీసుకెళ్లారని తెలిసింది
టీడీపీ వాళ్లు మా స్వగ్రామం నిమ్మాడకు రానివ్వడంలేదు
అత్తయ్యకు పింఛను, మామయ్య రేషన్‌కార్డు తీసేశారు..
మా చుట్టాలంతా బయటకెళ్లి బతుకుతున్నారు
ఆయనకు ప్రాణహాని ఉంది
నిమ్మాడకు చెందిన కింజరాపు అప్పన్న భార్య ఎస్పీకి ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్ : నిమ్మాడ.. శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రివర్యులైన కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడుల స్వగ్రామం. ఇదే గ్రామానికి చెందిన కింజరాపు చంద్రకళ అనే వివాహిత తన భర్త కింజరాపు అప్పన్న ఈనెల 29 నుంచి కనపడటంలేదని, ఇద్దరు కానిస్టేబుళ్లు తీసుకెళ్లినట్లు తెలిసిందని, 78 గంటలైనా తన భర్త జాడలేదని, ఆయన ప్రాణానికి హాని ఉందని మీడియా ముందు కన్నీటిపర్యంతమైంది. ఏడాదిన్నరగా నిమ్మాడలోకి అడుగు పెట్టలేకపోతున్నామని, తెలుగుదేశం పార్టీ వాళ్లు రానీయడంలేదని ఆరోపించారు. ఇదే విషయమై జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న ఎస్పీ మహేశ్వరరెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు ఆమె గురువారం మీడియాకు వివరించారు.
29 నుంచి కనిపించడంలేదు..
గతనెల 29న మా కన్నవారి గ్రామమైన మెళియాపుట్టి మండలం కొసమాలలో కింజరాపు అప్పన్నను ఉ.8–10 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారు. అప్పుడు నేను వైజాగ్‌లో ఉండటంతో తెలీలేదు. సాయంత్రం వచ్చేస్తున్నానని చెప్పేందుకు నా భర్తకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. కన్నవారింటికి వచ్చాక బైక్, హెల్మెట్ అయితే ఉందిగానీ భర్త లేడు. ఇదే విషయం అక్కడ కొందరిని అడగ్గా ఎవరో ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారని చెప్పారు. ఆ తర్వాత నా భర్తకు చాలాసార్లు ఫోన్ చేశా. స్విచ్చాఫ్ రావడంతో అదేరోజు సా.6.30కు మెళియాపుట్టి స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశా.
ఎఫ్‌ఐఆర్ రాయమంటే.. ‘డైరీలో రాసి రేపు 9 గంటలకు రండి.. ఈలోగా విచారణ చేసి కనుక్కొని చెబుతాం’ అని అన్నారు. అయితే, మర్నాడు ‘ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు. రెండేళ్ల కిందట పనిచేసిన మెళియాపుట్టి కానిస్టేబుల్ చందు, మరొకతను తీసుకెళ్లారు’ అని స్థానికులు చెప్పారు. వెంటనే అక్కడి ఎస్‌ఐకు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని అనడంతో బుధవారం మళ్లీ స్టేషన్‌కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. ఎస్‌ఐను అడిగితే.. తమ వాళ్లయితే తీసుకెళ్లలేదని, చందు ఎవరో తెలీదని, ఎస్పీ దగ్గరకు వెళ్లమన్నారు. దీంతో బుధవారం రాత్రి ఎస్పీని కలవడానికి శ్రీకాకుళం వచ్చా. ఆయన లేకపోవడంతో మళ్లీ గురువారం వచ్చి ఎస్పీని కలిశాను.
టీడీపీ వాళ్లు నిమ్మాడకు రానీయడంలేదు..
‘ఏడాదిన్నర నుంచి టీడీపీ వాళ్లు మమ్మల్ని నిమ్మాడ గ్రామంలో అడుగుపెట్టనీయడం లేదు. పొలం ఉన్నా.. సాగుచేయకుండా ఉండిపోయింది. అత్తయ్యకు పింఛను, మామయ్య రేషన్‌కార్డు తీసేశారు. మా చుట్టాలంతా బయటకెళ్లి బతుకుతున్నారు. మేం ఒడిశా వెళ్లిపోయాం. నా భర్తను ఎవరేం చేశారోనని భయంగా ఉంది. ప్రాణహాని ఉందని ఆ ఊరికి వెళ్లడంలేదు. ఇదంతా రాజకీయపరంగా ఎవరో చేస్తున్నారు. నా భర్త ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు. ఎవరినీ చంపలేదు, మోసంచేసి డబ్బులు, ఆస్తులు తీసుకోలేదు’ అని చంద్రకళ తెలిపింది.


