అది 1895 నవంబర్ 8వ తేదీ రాత్రి. జర్మనీలోని ఊర్జ్‌బర్గ్ ల్యాబొరేటరీలో గుడ్డివెలుతురు నిండిన గదిలో భౌతిక శాస్త్రవేత్త విల్‌హెల్మ్ కాన్‌రాడ్ రాంట్‌జెన్ నెమ్మదిగా పనిచేసుకుంటూ ఉన్నాడు. ఆయన భార్య ‘అన్నా’ నిద్రపోయి చాలా సేపైంది. కానీ విల్‌హెల్మ్ ఇంకా గాజు గొట్టాలు, తీగల కాయిల్స్‌తో నిండిన ఆ గదినే పట్టుకుని వేలాడుతున్నాడు. చిన్నతనంలో గడియారాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి ఏకంగా వాటిని విప్పి చూసేవాడు. ఇప్పటికీ అటువంటి జిజ్ఞాసతోనే రోజుల్ని నిమిషా లుగా ఇలా గడిపేస్తున్నాడు.
ఆ సాయంత్రం ఆయన క్రూక్స్ ట్యూబ్ నుండి కాంతి బయటికి రాకుండా చేయడం కోసం నల్ల కార్డ్‌బోర్డ్‌ను చుట్టాడు. కరెంట్ ఆన్ చేశాడు. ఇప్పుడు నిజానికి క్రూక్స్ ట్యూబ్ నుండి కాంతి బయటికి రాకూడదు. అయినా, గదిలో కొద్ది దూరంలో ఉన్న బేరియం–ప్లాటినో–సైనైడ్ స్క్రీన్ (తెర) మీద ట్యూబ్ నుంచి వస్తున్న ఆకుపచ్చ కాంతి మెరుస్తోంది. రాంట్‌జెన్ గుండె దడదడ లాడింది. స్క్రీన్‌ను మరింత దూరం జరిపాడు. అయినా ఆ కాంతి దానిమీద పడుతూనే ఉంది. ఇలా కాదని ట్యూబ్‌కు, స్క్రీన్‌కు మధ్య పుస్తకం పెట్టాడు; కాంతి మసకబారింది కానీ ఆగిపోలేదు. ఈ సారి పుస్తకం బదులు చెక్కను పెట్టాడు. ఇంకా కాంతి పడుతూనే ఉంది. అతడిలోని జిజ్ఞాసువు మరింత రెచ్చిపోయాడు. ఒక పక్క భయమేస్తున్నా... వణుకుతూనే తన చేతిని అడ్డు పెట్టాడు.
సూర్యకాంతిలో నీడల్లా స్పష్టంగా, అతని వేళ్ల సన్నని ఎము కలు స్క్రీన్ మీద కనిపించాయి. అతడిలో ఆసక్తి రెట్టింపయ్యింది. శక్తిమంతమైన ఈ కిరణాల వల్లే ఇదంతా జరుగుతోందని గ్రహించాడు. ఇప్పటివరకూ ఇటువంటి కిరణాలు ఉన్నాయనే తెలియదు కాబట్టి వాటి పేరు కూడా తెలియదు. గణితం, భౌతిక శాస్త్రంలో తెలియని విలువలనూ, పేర్లనూ ‘ఎక్స్’ అని పిలవడం మామూలే. అందుకే ఈ కిరణాలను‘ఎక్స్–రేస్’ అని పిలిచాడు.
కొన్ని రోజుల తరువాత భార్య అన్నాను ఫొటోగ్రాఫిక్ ప్లేట్ మీద చేయి ఉంచమని కోరాడు. ఆమె కొద్దిగా సంకోచించింది కానీ అతడు కోరినట్లే తన పెళ్లి ఉంగరం ఉన్న చేతిని ఉంచింది. ఉంగరం తెల్లటి వృత్తంగా, ఆమె ఎముకలు చర్మం కింద సన్నగా, ప్రకాశవంతంగా కనిపించాయి. అన్నా గాబరా పడింది. ఆనందంతో ‘నా సొంత ఎముకలు చూస్తున్నాను’ అంది. ‘ఈ అను భవం ఎంత అందంగా, ఎంత భయంకరంగా ఉందో’ అంటూ గుసగుసలాడింది. రాంట్‌జెన్ ఆ రాత్రి నిద్రపోలేదు. డెస్క్ దగ్గర కూర్చుని ఆ ప్లేట్‌ను చూస్తూ ఉన్నాడు. యుద్ధాల నుంచి కుంటుకుంటూ తిరిగి వచ్చిన సైనికుల్ని గుర్తు చేసుకున్నాడు. వాసిన కండరాల కింద దాగిన విరిగిన ఎముకలతో ఉన్న పిల్లలు గుర్తుకు వచ్చారు. తుపాకి గుండు లేదా కణుతులు ఎక్కడ దాగాయో అంచనా వేస్తూ ఇష్టమొచ్చినట్లు శరీరాలను కోసే డాక్టర్లు గుర్తుకువచ్చారు. ఇప్పుడు తాను కనిపెట్టిన ఎక్స్ కిరణాలతో వీళ్లందరికీ ఎంత ఉపయోగమో మనసు పదే పదే చెబుతోంది.
తన ఆవిష్కరణలను నిశ్శబ్దంగా చిన్న జర్నల్‌లో ప్రచురించాడు. కొన్ని వారాల్లోనే ప్రపంచం మారిపోయింది. ఎక్స్‌రేతో వియెన్నాలో సర్జన్లు ఒక మహిళ చేతి లోపల ఉన్న సూదిని కను గొన్నారు. లండన్‌లో ఒక బాలిక గొంతులోని నాణెం ఒక్క కోత లేకుండా తీసేశారు.
రాంట్‌జెన్ ఎక్స్‌రేపై పేటెంట్ హక్కు తీసుకోవడానికి నిరా కరించాడు. ‘ఇది మానవాళికి చెందినది’ అన్నాడు. ఈ ఆవిష్కర ణకు గాను 1901లో మొదటి నోబెల్ భౌతికశాస్త్ర బహుమతి వచ్చి నప్పుడు, ఆ డబ్బును తన యూనివర్సిటీకి ఇచ్చేశాడు. అతను ఎప్పుడూ ప్రచారాన్ని కోరుకోలేదు. ఇప్పుడు ఎక్సరే కానీ, దానిపై ఆధారపడి తయారు చేసిన ఆధునిక స్కానింగ్ మిషన్లు కానీ లేకుండా మన వైద్య రంగాన్ని ఊహించనైనా ఊహించలేం.


