అసలు కంటే కొసరు మక్కువ అనేది నానుడి. ఒడిశా అటవీశాఖ అధికారులు చేసిన ఓ పని ఇలాగే ఉంది. అసలు కంటే కొసరు కోసం ఎక్కువ ఖర్చు చేసి వివాదంలో చిక్కుకున్నారు. డిపార్ట్‌మెంట్ అవసరాల కోసం 51 కార్లు కొన్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే కార్లు కొన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ కార్లకు అదనపు హంగుల కోసం వెచ్చించిన ధర దాదాపు వాహనాల రేటుకు దగ్గర ఉండడంతో వివాదం రాజుకుంది. అటవీశాఖ అధికారుల కొను గోల్‌మాల్ బయటపడడంతో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
అటవీ శాఖ 2024–25 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా కంపెనీకి చెందిన 51 థార్ (Thar) ఎస్‌యూవీలను కొనుగోలు చేసింది. ఒక్కో కారుకు రూ.14 లక్షలు చొప్పున 7 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేసింది. తమ విభాగం అవసరాలకు అనుగుణంగా ఈ కార్లలో మార్పులు చేయడానికి అదనంగా రూ. 5 కోట్లు ఖర్చు చేయడంతో సమస్య మొదలైంది. మొత్తం 51 వాహనాలకు అదనపు హంగులతో కలిపి రూ. 12.35 కోట్లు వ్యయం అయినట్టు అధికార పత్రాలు ధ్రువీకరించాయి. దీంతో తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
నిగ్గు తేల్చాల్సిందే..
బీజేడీ ఎమ్మెల్యే అరుణ్ కుమార్ సాహూ (Arun Kumar Sahoo) గత మార్చి నెలలో ఈ అంశాన్ని శాసనసభ సమావేశాల్లో లేవనెత్తారు. అటవీశాఖ కొనుగోలు చేసిన వాహనాలకు అయిన ఖర్చు వివరాలు ఇవ్వాలని కోరడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కార్లు కొనడానికి 7 కోట్ల రూపాయలు ఖర్చయితే, అదనపు హంగులకు ఏకంగా రూ. 5 కోట్లు వెచ్చించినట్టు తాజాగా వెల్లడైంది. దీంతో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి గణేష్ రామ్ సింగ్ ఖుంటియా స్పందించారు. ప్రత్యేక ఆడిట్ నిర్వహించి, నిగ్గు తేల్చాలని అకౌంటెంట్ జనరల్ (ఏజీ)ని ఆదేశించారు. వాహనాల కొనుగోలు ప్రక్రియతో పాటు మార్పుల కోసం అయిన ఖర్చులను కూడా పరిశీలించాలని సూచించారు. అక్రమాలు జరిగినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పదని ఆయన హెచ్చరించారు.
అనవసరంగా ఖర్చు చేస్తే సహించం
వాహనాలకు అదనపు హంగుల కోసం పెట్టిన ఖర్చు సహేతుకమా, కాదా అనేది తేల్చేందుకే ప్రత్యేక ఆడిట్ చేయాలని ఆదేశించినట్టు మంత్రి గణేష్ రామ్ సింగ్ (Ganesh Ram Singh Khuntia) తెలిపారు. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. అటవీశాఖ అవసరాలకు అనుగుణంగా వాహనాల్లో కొన్ని మార్పులు చేస్తుంటారని చెప్పారు. అడవుల్లో విధులు నిర్వహించేందుకు అనువుగా ఉండేలా వాహనాల్లో అదనపు లైట్లు, కెమెరాలు, సైరన్‌లు, ప్రత్యేక టైర్లు, ఇతర పరికరాలను అమర్చుతారని తెలిపారు. అయితే అధికంగా లేదా అనవసరంగా చేసే ఎలాంటి ఖర్చునైనా తాము సహించబోమని ఆయన స్పష్టం చేశారు.
చదవండి: త్వరలో మోదీ 3.ఓ కేబినెట్ విస్తరణ!
మార్పులు అవసరం
తాము కొనుగోలు చేసిన వాహనాలకు అవసరానికి మించి ఖర్చు చేశామా, లేదా అనేది ఆడిటింగ్ తేలుతుందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. తమ శాఖ విధులకు అనుగుణంగా వాహనాలకు మార్పులు చేయడం అవసరమని వారు చెబుతున్నారు. ఫ్రంట్‌లైన్ సిబ్బంది పెట్రోలింగ్, దావానలం నియంత్రణ, వన్యప్రాణుల రక్షణ, కలప అక్రమ రవాణా నివారణ, పర్యాటకుల జంగిల్ సఫారీల కోసం ఈ వాహనాలను వినియోగిస్తామని చెప్పారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్, సత్కోసియా టైగర్ రిజర్వ్, డెబ్రిఘర్ వన్యప్రాణుల అభయారణ్యం సహా ఇతర ముఖ్యమైన వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాల్లో విధులకు ఈ కస్టమైజ్డ్ ఎస్‌యూవీలను వినియోగిస్తున్నట్టు తెలిపారు.


