గూగుల్, ఓపెన్‌ఏఐ, పెర్ప్లెక్సిటీలాంటి టెక్ దిగ్గజాలు ఈ సంవత్సరం ఏఐ–ఆధారిత బ్రౌజర్‌లకు శ్రీకారం చుట్టాయి. తాజా విషయం ఏమిటంటే.. గూగుల్‌లోని క్రోమ్ బృందం ‘డిస్కో’ పేరుతో కొత్త జెమిని 3–ఆధారిత బ్రౌజర్‌ను ఆవిష్కరించింది.
ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయడానికి అనుమతించే సంప్రదాయ బ్రౌజర్‌ల మాదిరిగా కాకుండా, గూగుల్ ‘డిస్కో’ జెన్ ట్యాబ్స్‌ను (Gentabs) ఉపయోగిస్తుంది. ప్రశ్న లేదా ప్రాంప్ట్‌లను ఇన్‌పుట్‌గా తీసుకుంటుంది. వీటికి సంబంధించిన ట్యాబ్‌లను ఓపెన్ చేస్తుంది. అంతేకాదు మనం సెర్చ్ చేస్తున్నదానికి సంబంధించి కస్టమ్ యాప్ క్రియేట్ చేస్తుంది.
ఉదాహరణకు... మనం ‘డిస్కో’ను ట్రావెల్ టిప్స్ అడిగితే ఆటోమేటిక్‌గా ప్లానర్ యాప్‌ను క్రియేట్ చేస్తుంది. గూగుల్ క్రోమ్‌లాగే బ్రౌజింగ్, ట్యాబ్‌లను ఒపెన్ చేయడం, ఎక్స్‌టెన్షన్స్, పేజీలను నావిగేట్ చేయడంలో ‘డిస్కో’ ఉపయోగపడుతుంది.
ఈ కొత్త బ్రౌజర్‌తో యూజర్‌లు ఎలాంటి కోడ్‌ను రాయాల్సిన అవసరం ఉండదు. మనకు కావాల్సిన వాటిని సింపుల్‌గా వివరిస్తే సరిపోతుంది. ఈ ఏఐ–జనరేటెడ్ వెబ్ యాప్‌తో టెక్స్ ప్రాంప్ట్‌ల ద్వారా లేఅవుట్స్, విజువల్, ఫీచర్స్‌కు సంబంధించి మార్పు చేర్పులు చేయవచ్చు.
ప్రతి ఏఐ–జనరేటెడ్ కంటెంట్ ఒరిజినల్ వెబ్ సోర్స్‌తో లింకై ఉంటుంది. మీల్స్ ప్లాన్, ట్రావెల్ ప్లాన్, పిల్లలకు గ్రహాల గురించి పరిచయం చేయడానికి విద్యార్థులకు కూడా బాగా ఉపయోగపడుతుంది డిస్కో. ఒక నిర్దిష్టమైన అంశం గురించి తెలుసుకోవాలనుకుంటే, ఆ అంశానికి సంబంధించి జెన్ ట్యాబ్ ఒక యాప్‌ను క్రియేట్ చేస్తుంది. సమాచారాన్ని విజువలైజ్ చేసి కాన్సెప్ట్ సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది.
చదవండి: ఫ్లెక్స్ క్రెడిట్ కార్డుతో యూపీఐ చెల్లింపులు
‘డిస్కో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ప్రతీది సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఇది తక్కువ మంది టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నందున దీనిని యాక్సెస్ చేయడానికి మీరు వెయిట్ లిస్ట్‌లో చేరాల్సి ఉంటుంది’ అని గూగుల్ ప్రకటించింది.


