భారత్‌ 14–3 కెనడా | India in Azlan Shah Cup final | Sakshi
Sakshi News home page

భారత్‌ 14–3 కెనడా

Nov 30 2025 3:01 AM | Updated on Nov 30 2025 3:01 AM

India in Azlan Shah Cup final

అజ్లాన్‌ షా కప్‌ ఫైనల్లో భారత్‌

నేడు బెల్జియంతో తుది పోరు

ఇపో (మలేసియా): టోర్నీ ఆసాంతం సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన భారత పురుషుల హాకీ జట్టు... సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ టోర్నమెంట్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు 14–3 గోల్స్‌ తేడాతో కెనడాపై విజయం సాధించింది. జుగ్‌రాజ్‌ సింగ్‌ నాలుగు గోల్స్‌తో జట్టు భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మరో మ్యాచ్‌లో బెల్జియం 5–1 గోల్స్‌ తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఆదివారం బెల్జియంతో భారత్‌ ఫైనల్లో తలపడనుంది. 

చివరి పోరులో భారత జట్టు అదరగొట్టింది. జుగ్‌రాజ్‌ సింగ్‌ (12వ, 26వ, 39వ, 50వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో విజృంభించగా... రాజిందర్‌ (10వ, 24వ నిమిషాల్లో), అమిత్‌ రొహిదాస్‌ (15వ, 46వ నిమిషాల్లో), అభిషేక్‌ (57వ, 59వ నిమిషాల్లో) డబుల్‌ గోల్స్‌తో ఆకట్టుకున్నారు. నీలకంఠ శర్మ (4వ నిమిషంలో), దిల్‌ప్రీత్‌ సింగ్‌ (25వ నిమిషంలో), సెల్వం కార్తీ (43వ నిమిషంలో), సంజయ్‌ (56వ నిమిషంలో) తలా ఒక గోల్‌ చేశారు. 

కెనడా తరఫున బ్రెండన్‌ గురాలిక్‌ (11వ నిమిషంలో), మాథ్యూ సార్మెంటో (35వ నిమిషంలో), సిద్ధు (55వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. మ్యాచ్‌ ఆరంభమైన నాలుగో నిమిషంలోనే నీలకంఠ శర్మ గోల్‌ కొట్టడంతో భారత జట్టు ఆధిక్యంలో నిలిచింది. మంచి ఆరంభం దక్కించుకున్న భారత జట్టు అదే జోరు కొనసాగిస్తూ... తొలి క్వార్టర్‌ ముగిసే సరికి మరో రెండు గోల్స్‌ బాదింది. అదే సమయంలో కెనడా జట్టు కూడా బోణీ కొట్టడంతో తొలి క్వార్టర్‌ ముగిసేసరికి భారత్‌ 3–1తో ముందంజలో నిలిచింది. 

సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన టీమిండియా... రెండో క్వార్టర్‌లోనూ జోరు కొనసాగించింది. రాజిందర్, జుగ్‌రాజ్, దిల్‌ప్రీత్‌ గోల్స్‌ చేయడంతో రెండో క్వార్టర్‌ ముగిసే సరికి భారత్‌ 7–1తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. మూడో క్వార్టర్‌లో కెనడా తరఫున ఒక గోల్‌ నమోదు కాగా... భారత్‌ తరఫున జుగ్‌రాజ్‌ మూడో గోల్‌ సెల్వం కార్తి ఒక గోల్‌ చేశారు. ఇక చివరి క్వార్టర్‌లో గోల్స్‌ వర్షం కురిసింది. భారత జట్టు ఐదు గోల్స్‌తో విరుచుకుపడగా... కెనడా ప్లేయర్‌ ఒక గోల్‌ చేశాడు. 

ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లాడిన భారత్‌ 4 విజయాలు, ఒక పరాజయంతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరగా... బెల్జియం ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి మరొకటి ‘డ్రా’ చేసుకొని 13 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో నిలిచి తుదిపోరుకు అర్హత సాధించింది.   

Advertisement
 
Advertisement
Advertisement