breaking news
Sultan Azlan Shah Cup hockey tournament
-
భారత్ 14–3 కెనడా
ఇపో (మలేసియా): టోర్నీ ఆసాంతం సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన భారత పురుషుల హాకీ జట్టు... సుల్తాన్ అజ్లాన్ షా కప్ టోర్నమెంట్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 14–3 గోల్స్ తేడాతో కెనడాపై విజయం సాధించింది. జుగ్రాజ్ సింగ్ నాలుగు గోల్స్‌తో జట్టు భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మరో మ్యాచ్‌లో బెల్జియం 5–1 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఆదివారం బెల్జియంతో భారత్ ఫైనల్లో తలపడనుంది. చివరి పోరులో భారత జట్టు అదరగొట్టింది. జుగ్రాజ్ సింగ్ (12వ, 26వ, 39వ, 50వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో విజృంభించగా... రాజిందర్ (10వ, 24వ నిమిషాల్లో), అమిత్ రొహిదాస్ (15వ, 46వ నిమిషాల్లో), అభిషేక్ (57వ, 59వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో ఆకట్టుకున్నారు. నీలకంఠ శర్మ (4వ నిమిషంలో), దిల్‌ప్రీత్ సింగ్ (25వ నిమిషంలో), సెల్వం కార్తీ (43వ నిమిషంలో), సంజయ్ (56వ నిమిషంలో) తలా ఒక గోల్ చేశారు. కెనడా తరఫున బ్రెండన్ గురాలిక్ (11వ నిమిషంలో), మాథ్యూ సార్మెంటో (35వ నిమిషంలో), సిద్ధు (55వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభమైన నాలుగో నిమిషంలోనే నీలకంఠ శర్మ గోల్ కొట్టడంతో భారత జట్టు ఆధిక్యంలో నిలిచింది. మంచి ఆరంభం దక్కించుకున్న భారత జట్టు అదే జోరు కొనసాగిస్తూ... తొలి క్వార్టర్ ముగిసే సరికి మరో రెండు గోల్స్ బాదింది. అదే సమయంలో కెనడా జట్టు కూడా బోణీ కొట్టడంతో తొలి క్వార్టర్ ముగిసేసరికి భారత్ 3–1తో ముందంజలో నిలిచింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన టీమిండియా... రెండో క్వార్టర్లోనూ జోరు కొనసాగించింది. రాజిందర్, జుగ్రాజ్, దిల్‌ప్రీత్ గోల్స్ చేయడంతో రెండో క్వార్టర్ ముగిసే సరికి భారత్ 7–1తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. మూడో క్వార్టర్లో కెనడా తరఫున ఒక గోల్ నమోదు కాగా... భారత్ తరఫున జుగ్రాజ్ మూడో గోల్ సెల్వం కార్తి ఒక గోల్ చేశారు. ఇక చివరి క్వార్టర్లో గోల్స్ వర్షం కురిసింది. భారత జట్టు ఐదు గోల్స్‌తో విరుచుకుపడగా... కెనడా ప్లేయర్ ఒక గోల్ చేశాడు. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లాడిన భారత్ 4 విజయాలు, ఒక పరాజయంతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంలో నిలిచి ఫైనల్ చేరగా... బెల్జియం ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి మరొకటి ‘డ్రా’ చేసుకొని 13 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో నిలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. -
భారత్ శుభారంభం
కౌలాంపూర్: సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి పోరులో ఐదుసార్లు చాంపియన్ భారత జట్టు 1–0 గోల్స్ తేడాతో మూడు సార్లు చాంపియన్ దక్షిణ కొరియాను చిత్తుచేసింది. భారత్ తరఫున మొహమ్మద్ రాహీల్ (15వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. ఆరేళ్ల విరామం తర్వాత ఈ టోర్నీలో ఆడిన భారత జట్టు... ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చింది. 2019లో చివరిసారిగా ఈ టోర్నమెంట్లో ఆడిన టీమిండియా రన్నరప్‌గా నిలిచింది. అప్పుడు ఫైనల్లో ఓడిన కొరియాపైనే గెలిచి ఈ సీజన్లో బోణీ కొట్టింది. దిల్‌ప్రీత్ సింగ్ చక్కటి పాస్‌తో రాహీల్‌కు గోల్ చేసే అవకాశం దక్కగా... మ్యాచ్ ఆసాంతం మనవాళ్ల పైచేయి సాగింది. మ్యాచ్ 27వ నిమిషంలో కొరియా జట్టుకు స్కోరు సమం చేసే అవకాశం వచ్చినా దాన్ని వినియోగించుకోలేకపోయింది. భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ఆరు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. తొలి రోజు జరిగిన ఇతర రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. న్యూజిలాండ్, మలేసియా జట్ల మధ్య మ్యాచ్ 2–2 గోల్స్‌తో సమం కాగా... బెల్జియం, కెనడా జట్ల మధ్య పోరు 1–1 గోల్స్‌తో ‘డ్రా’ అయింది. తదుపరి పోరులో సోమవారం బెల్జియంతో భారత జట్టు తలపడనుంది. మొత్తం ఆరు జట్లు తలపడుతున్న ఈ టోర్నమెంట్లో రౌండ్ రాబిన్ పద్ధతిలో ఒక్కో జట్టు మిగిలిన ఐదు టీమ్‌లతో మ్యాచ్‌లు ఆడనుంది. -
శుభారంభమే లక్ష్యంగా...
ఐపో (మలేసియా): సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో ఐదు సార్లు చాంపియన్ అయిన భారత హాకీ జట్టు మరో సారి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. టోర్నీ చరిత్రలో రెండో విజయవంతమైన జట్టుగా ఘనత వహించిన భారత్ ఆదివారం జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో ఢీకొనేందుకు సిద్ధమైంది. నాలుగేళ్ల విరామం తర్వాత భారత్ ఈ ఇన్విటేషనల్ టోర్నీ ఆడుతోంది. 2019 తర్వాత భారత్ ఈ టోర్నీలో ఆడలేకపోయింది. ఈ సారి మొత్తం ఆరు జట్లు బరిలో ఉన్నాయి. భారత్, బెల్జియం, కెనడా, కొరియా, న్యూజిలాండ్ సహా ఆతిథ్య మలేసియా అజ్లాన్ షా సమరానికి సై అంటున్నాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. పాయింట్ల పట్టికలో టాప్–2లో నిలిచిన జట్లు అమీతుమీకి అర్హత సాధిస్తాయి. కొరియాతో మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే భారత్ 24న పటిష్టమైన బెల్జియంతో తలపడుతుంది. 26న మలేసియాతో, 27న న్యూజిలాండ్‌తో, చివరి లీగ్ మ్యాచ్‌ను 29న కెనడాతో తలపడుతుంది. టైటిల్ పోరు 30న నిర్వహిస్తారు. వచ్చే ఏడాది ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్‌తో పాటు, ఆసియా క్రీడలు కూడా జరుగనున్న నేపథ్యంతో ఈ టోర్నీలో జరుగుతుంది. ఈ టోర్నీలో పలువురు సీనియర్ ఆటగాళ్లు, రెగ్యులర్ కెపె్టన్‌హర్మన్‌ప్రీత్ సింగ్, మన్‌ప్రీత్ తదితరులకు విశ్రాంతి ఇచ్చారు. -
విజయంతో ముగించారు
ఇఫో (మలేసియా): సుల్తాన్ అజ్లాన్‌షా కప్ హాకీ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. గత మ్యాచ్‌లో బలహీన ప్రత్యర్థి ఐర్లాండ్ చేతిలో దిబ్బతిన్న సర్దార్‌సింగ్ సేన శనివారం అదే జట్టును 4–1తో చిత్తుచేసి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. భారత జట్టు తరఫున వరుణ్ కుమార్ (5వ, 32వ నిమిషం) రెండు గోల్స్, శైలానంద్ లక్డా (28వ నిమిషం), గుర్జాంత్ సింగ్ (37వ నిమిషం) చెరో గోల్ చేశారు. ప్రత్యర్థి జట్టులో జూలియన్ డాలె (48వ నిమిషం) ఏకైక గోల్ సాధించాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన సర్దార్ సింగ్ సేన మ్యాచ్ ఆసాంతం పైచేయి కొనసాగించింది. ఐదో నిమిషంలో వచ్చిన రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాల్లో మొదటిది వృథా కాగా... రెండో దాన్ని వరుణ్ కుమార్ గోల్‌గా మలిచి భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత కూడా దాడులు కొనసాగించిన మన ఆటగాళ్లు మరో మూడు గోల్స్‌తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించారు. చివరి క్వార్టర్లో ప్రత్యర్థి ఓ గోల్ కొట్టినా ఆధిక్యం తగ్గించడం తప్ప అది జట్టుకు ఉపయోగపడలేదు. సర్దార్ సింగ్ సారథ్యంలో ఈ టోర్నీలో భారత్ తొలిసారి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. అతడి కెప్టెన్సీలో 2008లో రజతం, 2015, 2016లో కాంస్య, రజతాలు గెలుచుకుంది. -
‘డ్రా’తో సరిపెట్టుకున్నారు
ఇఫో (మలేసియా): సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో భారత జట్టు రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఇంగ్లండ్‌తో ఆదివారం ఇక్కడ జరిగిన పోరులో తుదికంటా ఆధిపత్యం చలాయించిన భారత్ చివరకు 1–1తో ‘డ్రా’తో సరిపెట్టుకుంది. గత మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్ చాంపియన్ అర్జెంటీనా చేతిలో 2–3తో ఓటమి పాలైన సర్దార్ సింగ్ సేన ఈ మ్యాచ్‌లో ఆకట్టుకుంది. శైలానంద్ లక్రా (14వ ని.) తొలి అంతర్జాతీయ గోల్ చేసి భారత్‌కు ఆధిక్యం అందించగా... డిఫెండర్లు ప్రత్యర్థిని నిలువరించడంతో ఆట 53వ నిమిషం వరకు టీమిండియా ఆధిపత్యం కొనసాగింది. మ్యాచ్ ముగియడానికి ఏడు నిమిషాల ముందు ఇంగ్లండ్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను మార్క్ గ్లెగోర్న్ గోల్‌గా మలచడంతో స్కోరు 1–1తో సమమైంది. అనంతరం ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా మరో గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు 9 పెనాల్టీ కార్నర్లు లభించినా వరుణ్ కుమార్, అమిత్ రొహిదాస్ వాటిని గోల్స్‌గా మలచడంలో విఫలమయ్యారు. ఆరు దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో ఓడి రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం ప్రపంచ నంబర్‌వన్ ఆస్ట్రేలియాతో ఆడుతుంది. -
భారత్ ఖాతాలో కాంస్యం
అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ ఇపో (మలేసియా): ఆతిథ్య దేశం మలేసియా చేతిలో చివరి లీగ్ మ్యాచ్‌లో అనూహ్య ఓటమితో పసిడి పోరుకు అర్హత పొందలేకపోయిన భారత్... సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో కాంస్య పతకంతో సంతృప్తి పడింది. న్యూజిలాండ్ జట్టుతో శనివారం జరిగిన కాంస్య పతక పోరులో టీమిండియా 4–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (17వ, 27వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... ఎస్వీ సునీల్ (48వ నిమిషంలో), తల్విందర్ సింగ్ (60వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. 34 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత్ కాంస్య పతకం సాధించడం ఇది ఏడోసారి. గతంలో భారత్ 1983, 2000, 2006, 2007, 2012, 2015లో కాంస్య పతకాలు గెలిచింది. మరోవైపు ఫైనల్లో బ్రిటన్ 4–3తో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా జట్టును ఓడించి విజేతగా నిలిచింది. 1994 తర్వాత బ్రిటన్ ఈ టోర్నీలో టైటిల్ సాధించడం విశేషం. ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో మలేసియా 3–1తో జపాన్ను ఓడించి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. జపాన్‌కు చివరిదైన ఆరో స్థానం లభించింది. -
భారత్‌కు తొలి పరాజయం
ఆస్ట్రేలియా చేతిలో 1–3తో ఓటమి అజ్లాన్ షా హాకీ టోర్నీ ఐపో (మలేసియా): సుల్తాన్ అజ్లాన్‌షా కప్ హాకీ టోర్నీలో భారత్‌కు తొలి పరాజయం ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 3–1తో భారత్‌ను కంగుతినిపించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (26వ ని.) ఫీల్డ్ గోల్ చేయగా, ఆస్ట్రేలియా జట్టుకు ఎడీ ఒకెండెన్ (30వ ని.), టామ్ క్రెయిగ్ (34వ ని.), టామ్ విక్హమ్ (51వ ని.) తలా ఒక ఫీల్డ్ గోల్ సాధించిపెట్టారు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ ఆసీస్ దూకుడుతో మొదలైనా... భారత డిఫెండర్లు ఎక్కడికక్కడ నిలువరించడంలో సఫలమయ్యారు. తొలిక్వార్టర్లో భారత గోల్‌పోస్ట్‌పై గురిపెట్టిన దాడుల్ని చాకచక్కంగా అడ్డుకున్నారు. భారత ఆటగాళ్ల ప్రయత్నాలను ఆసీస్ ఆటగాళ్లు అడ్డుకోవడంతో తొలి క్వార్టర్ గోల్ లేకుండానే ముగిసింది. ఇక రెండో క్వార్టర్లో కూడా భారత ఆటగాళ్లు చెమటోడ్చినప్పటికీ అందివచ్చిన అవకాశాల్ని గోల్‌గా మలచలేకపోయారు. ఎట్టకేలకు ఆట 26వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ ‘డి’ సర్కిల్ కుడివైపు నుంచి కొట్టిన షాట్ ప్రత్యర్థి ఆటగాళ్లను బోల్తాకొట్టిస్తూ గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. దీంతో భారత్ 1–0తో ఆధిక్యాన్ని పొందినప్పటికీ నాలుగు నిమిషాల వ్యవధిలోనే ఈ స్కోరు 1–1తో సమమైంది. ఆట 30వ నిమిషంలో జెరెమీ హేవర్డ్ ఇచ్చిన లాంగ్‌పాస్‌ను ఒకెండెన్ చక్కని షాట్‌తో గోల్‌గా మలిచాడు. దీంతో రెండో క్వార్టర్ 1–1తో ముగిసింది. ఇక తర్వాతి మూడు, నాలుగు క్వార్టర్లలో భారత ఆటగాళ్లకేదీ కలసిరాలేదు. టీమిండియా రక్షణ పంక్తిని ఛేదిస్తూ ఆస్ట్రేలియన్లు క్వార్టర్‌కు ఒకటి చొప్పున గోల్ చేయడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. క్రెయిగ్ 34వ నిమిషంలో, విక్హమ్ 51వ నిమిషంలో చెరో గోల్ చేశారు. తొమ్మిది సార్లు అజ్లాన్ షా విజేత అయిన ఆసీస్ ప్రస్తుతం 7 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లపై గెలుపొందిన భారత్ ఖాతాలో ఇప్పుడు 4 పాయింట్లున్నాయి. నేడు (బుధవారం) జరిగే పోరులో భారత్...జపాన్‌తో తలపడనుంది. మ్యాచ్ ఫలితంపై భారత కోచ్ ఓల్ట్‌మన్స్ మాట్లాడుతూ ‘అనుకున్న గేమ్‌ప్లాన్‌ను ఆచరణలో పెట్టలేకే జట్టు ఓడింది. మ్యాచ్‌లో తొలి గోల్‌తో ఆధిక్యంలోకి వచ్చేదాకా మావాళ్లు బాగానే ఆడారు. కానీ ఆ తర్వాతే ఆదమరిచారు. ఇదే మ్యాచ్‌ను మా నుంచి దూరం చేసింది’ అని అన్నారు.


