అజ్లాన్ షా హాకీ టోర్నీ బరిలో భారత్
నేడు తొలి మ్యాచ్‌లో కొరియాతో ఢీ
ఐపో (మలేసియా): సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో ఐదు సార్లు చాంపియన్ అయిన భారత హాకీ జట్టు మరో సారి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. టోర్నీ చరిత్రలో రెండో విజయవంతమైన జట్టుగా ఘనత వహించిన భారత్ ఆదివారం జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో ఢీకొనేందుకు సిద్ధమైంది. నాలుగేళ్ల విరామం తర్వాత భారత్ ఈ ఇన్విటేషనల్ టోర్నీ ఆడుతోంది.
2019 తర్వాత భారత్ ఈ టోర్నీలో ఆడలేకపోయింది. ఈ సారి మొత్తం ఆరు జట్లు బరిలో ఉన్నాయి. భారత్, బెల్జియం, కెనడా, కొరియా, న్యూజిలాండ్ సహా ఆతిథ్య మలేసియా అజ్లాన్ షా సమరానికి సై అంటున్నాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. పాయింట్ల పట్టికలో టాప్–2లో నిలిచిన జట్లు అమీతుమీకి అర్హత సాధిస్తాయి.
కొరియాతో మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే భారత్ 24న పటిష్టమైన బెల్జియంతో తలపడుతుంది. 26న మలేసియాతో, 27న న్యూజిలాండ్‌తో, చివరి లీగ్ మ్యాచ్‌ను 29న కెనడాతో తలపడుతుంది. టైటిల్ పోరు 30న నిర్వహిస్తారు. వచ్చే ఏడాది ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్‌తో పాటు, ఆసియా క్రీడలు కూడా జరుగనున్న నేపథ్యంతో ఈ టోర్నీలో జరుగుతుంది. ఈ టోర్నీలో పలువురు సీనియర్ ఆటగాళ్లు, రెగ్యులర్ కెపె్టన్‌హర్మన్‌ప్రీత్ సింగ్, మన్‌ప్రీత్ తదితరులకు విశ్రాంతి ఇచ్చారు.


