కౌలాంపూర్: సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి పోరులో ఐదుసార్లు చాంపియన్ భారత జట్టు 1–0 గోల్స్ తేడాతో మూడు సార్లు చాంపియన్ దక్షిణ కొరియాను చిత్తుచేసింది. భారత్ తరఫున మొహమ్మద్ రాహీల్ (15వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. ఆరేళ్ల విరామం తర్వాత ఈ టోర్నీలో ఆడిన భారత జట్టు... ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చింది. 2019లో చివరిసారిగా ఈ టోర్నమెంట్‌లో ఆడిన టీమిండియా రన్నరప్‌గా నిలిచింది.
అప్పుడు ఫైనల్లో ఓడిన కొరియాపైనే గెలిచి ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. దిల్‌ప్రీత్ సింగ్ చక్కటి పాస్‌తో రాహీల్‌కు గోల్ చేసే అవకాశం దక్కగా... మ్యాచ్ ఆసాంతం మనవాళ్ల పైచేయి సాగింది. మ్యాచ్ 27వ నిమిషంలో కొరియా జట్టుకు స్కోరు సమం చేసే అవకాశం వచ్చినా దాన్ని వినియోగించుకోలేకపోయింది. భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ఆరు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.
తొలి రోజు జరిగిన ఇతర రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. న్యూజిలాండ్, మలేసియా జట్ల మధ్య మ్యాచ్ 2–2 గోల్స్‌తో సమం కాగా... బెల్జియం, కెనడా జట్ల మధ్య పోరు 1–1 గోల్స్‌తో ‘డ్రా’ అయింది. తదుపరి పోరులో సోమవారం బెల్జియంతో భారత జట్టు తలపడనుంది. మొత్తం ఆరు జట్లు తలపడుతున్న ఈ టోర్నమెంట్‌లో రౌండ్ రాబిన్ పద్ధతిలో ఒక్కో జట్టు మిగిలిన ఐదు టీమ్‌లతో మ్యాచ్‌లు ఆడనుంది.


