ధ్రువీకరించిన దక్షిణ కొరియా, జపాన్
సముద్ర జలాల్లో పడ్డాయని వెల్లడి
చర్చలకు రావాలని దక్షిణ కొరియా పిలుపు
సియోల్: ఉత్తర కొరియా ఆదివారం తన తూర్పు ప్రాంత సముద్ర జలాల మీదుగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, జపాన్‌లు ధ్రువీకరించాయి. ఉత్తర కొరియా ఆదివారం ఉదయం 7.50 గంటల సమయంలో పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఇవి సుమారు 900 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, సముద్ర జలాల్లో పడిపోయాయంది.
ఈ ప్రయోగాలకు సంబంధించి సేకరించిన వివరాలను అమెరికాతో కలిసి విశ్లేషిస్తున్నట్లు వివరించింది. ఉత్తరకొరియా ఆదివారం కనీసం రెండు బాలిసిŠట్‌క్ క్షిపణులను ప్రయోగించినట్లు జపాన్ ధ్రువీకరించింది. ఉత్తరకొరియా చర్యలు తమ దేశానికి, ఈ ప్రాంతానికేకాదు, ప్రపంచానికే బెడదగా పరిణమించాయని పేర్కొంది. భద్రతా మండలి తీర్మానాలకు లోబడి, బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు స్వస్తి చెప్పాలని, తమతో చర్చలకు ముందుకు రావాలని, కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపనకు తోడ్పడాలని దక్షిణ కొరియా పిలుపునిచి్చంది.
ఇలా ఉండగా, ఈ జనవరి లేదా ఫిబ్రవరిలో ఉత్తరకొరియా అధికార కమ్యూనిస్ట్ వర్కర్స్ పార్టీ భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలోనే కిమ్ ప్రభుత్వం మారనున్న విదేశాంగ విధానాలకు అనుగుణంగా ఈ ప్రయోగాలను చేపట్టి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. గతవారం దీర్ఘశ్రేణి వ్యూహాత్మక క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించిన కిమ్ సైన్యం, అంతకుముందు నిర్మాణంలో ఉన్న అణు జలాంతర్గామికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. దీంతోపాటు, ఒక వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు జరిగిన పక్షంలో పైచేయి సాధించేందుకు సైతం కిమ్ వీటిని ఉపయోగించుకునే వ్యూహం కూడా ఉండి ఉంటుందని భావిస్తున్నారు.
దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ చైనా పర్యటనకు బయలుదేరటానికి కొద్ది గంటల ముందు కిమ్ యంత్రాంగం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను చేపట్టడాన్ని కూడా పరిశీలకులు కీలక పరిణామంగానే భావిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా లీ జే మ్యుంగ్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఆయన, ఉత్తర కొరియా ఆయుధ పాటవాన్ని పెంచుకోవడంపై అభ్యంతరం తెలపడంతోపాటు, ఆ దేశాన్ని చర్చలకు ఒప్పించాలని కోరే అవకాశం ఉందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. శనివారం సియోల్ సమీపంలోని ఆయుధ కాంప్లెక్స్‌ను సందర్శించిన కిమ్.. ఆయుధాల ఉత్పత్తిని రెండున్నర రెట్లు పెంచాలని అధికారులను ఆదేశించినట్లు అధికార మీడియా తెలిపింది. వెనెజువెలా రాజధాని కారకాస్‌పై దాడి చేసి ఆ దేశాధ్యక్షుడిని అమెరికా పట్టుకెళ్లి జైలులో వేసిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.


