ఉన్నతి హుడా, తన్వీ శర్మ కూడా
లక్నో: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21–14, 11–4తో భారత్‌కే చెందిన ప్రియాన్షు రజావత్‌పై గెలుపొందాడు.
తొలి గేమ్‌ను నెగ్గిన శ్రీకాంత్, రెండో గేమ్‌లో ఏడు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నదశలో అతని ప్రత్యర్థి ప్రియాన్షు గాయం కారణంగా ఆటను కొనసాగించలేకపోయాడు. దాంతో రిఫరీ శ్రీకాంత్‌ను విజేతగా ప్రకటించారు. నేడు జరిగే సెమీఫైనల్లో భారత్‌కే చెందిన మిథున్ మంజునాథ్‌తో శ్రీకాంత్ తలపడతాడు.
క్వార్టర్ ఫైనల్లో మిథున్ 21–18, 21–13తో భారత్‌కే చెందిన మన్‌రాజ్ సింగ్‌ను ఓడించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్స్ తన్వీ శర్మ, ఉన్నతి హుడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో 16 ఏళ్ల తన్వీ శర్మ 21–8, 21–15తో లో సిన్ యాన్ (హాంకాంగ్)పై, ఉన్నతి 21–15, 13–21, 21–16తో భారత్‌కే చెందిన రక్షిత శ్రీపై గెలుపొందారు.
గాయత్రి జోడీ జోరు
మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–15, 21–16తో బెంగిసు ఎర్సెటిన్–నాజ్లికన్ ఇన్సి (టర్కీ) జంటను ఓడించింది. మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో హరిహరన్–ట్రెసా జాలీ (భారత్) జోడీ 21–18, 21–14తో అందికా–నొజోమి షిమిజు (ఆ్రస్టేలియా) జోడీపై గెలుపొందింది.


