హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా తమ జోరును కొనసాగిస్తోంది. శనివారం మోంగ్‌కాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో కంగారుల జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 6 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఏకంగా 149 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆసీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలుత ఓపెనర్ బెన్ మెక్‌డెర్మాట్ కేవలం 14 బంతుల్లో 8 సిక్స్‌ల సాయంతో 51 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
సూపర్ సిక్సెస్ టోర్నీ నిబంధనల ప్రకారం 50 పరుగులు చేసిన బ్యాటర్ 'రిటైర్డ్ హర్ట్'గా వెళ్లాల్సి ఉంటుంది. ఇక మెక్‌డెర్మాట్‌తో పాటు కెప్టెన్ అలెక్స్ రాస్ 11 బంతుల్లో 7 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో 50 పరుగులు చేశాడు. ఈ ఏడాది సూపర్ సిక్సెస్ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్లు 20 సిక్స్‌లు బాదారు.
తడబడిన బంగ్లా..
అనంతరం బంగ్లాదేశ్ 150 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లాదేశ్ తరఫున అబు హైదర్ ఒంటరి పోరాటం చేశాడు. హైదర్ 18 బంతుల్లో 7 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో క్రిస్ గ్రీన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్‌తో ఆదివారం తలపడనుంది.
చదవండి: అతడు లేకపోవడం కలిసొచ్చింది.. వారి వల్లే చెలరేగుతున్నాను: అభిషేక్


