బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదో టీ20 వర్షార్ఫణమైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ పంజాబీ క్రికెటర్ మొత్తంగా 161.39 స్ట్రైక్ రేటుతో 163 పరుగులు చేశాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మార్క్ అందుకున్న క్రికెటర్‌గా అభిషేక్(528) నిలిచాడు.
"ఆ్రస్టేలియా పర్యటన కోసం చాలా కాలంగా ఎదురు చూశాను. ఇక్కడ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. అక్కడి పరిస్ధితులకు తగ్గట్టుగా నేను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాను. మేము మరింత భారీ స్కోర్లు సాధించాల్సింది. అయితే జట్టు సిరీస్ గెలవడం ముఖ్యం. జోష్ హేజిల్‌వుడ్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం లేకపోవడం ఏ జట్టుకైనా ప్రయోజనకరమే.
కానీ భవిష్యత్తులో ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా అటువంటి బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. ఇక టీమ్ మేనేజ్‌మెంట్ నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. నేను వరుసగా 15 మ్యాచ్‌లలో డకౌట్ అయినా నా స్థానానికి ఢోకా ఉండదని చెప్పింది. అందుకే తొలి బంతినుంచే ధైర్యంగా, దూకుడుగా ఆడగలుగుతున్నా. తొలిసారి టి20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో అభిషేక్ పేర్కొన్నాడు.
చదవండి: ‘బంగభూషణ్’ రిచా ఘోష్


