కలిసి బరిలోకి దిగనున్న టీమిండియా యువ కెరటాలు | Shubman Gill, Abhishek Sharma in, Punjab name Vijay Hazare Trophy squad without a captain | Sakshi
Sakshi News home page

కలిసి బరిలోకి దిగనున్న టీమిండియా యువ కెరటాలు

Dec 22 2025 3:08 PM | Updated on Dec 22 2025 3:29 PM

Shubman Gill, Abhishek Sharma in, Punjab name Vijay Hazare Trophy squad without a captain

టీమిండియా యువ కెరటాలు శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ, అర్షదీప్‌ సింగ్‌ మరోసారి కలిసి బరిలోకి దిగనున్నారు. అయితే ఈసారి వారు ప్రాతినిథ్యం వహించనున్నది టీమిండియాకు కాదు. ఈ ముగ్గురు యువ తారలు విజయ్‌ హజారే వన్డే ట్రోఫీ (VHT) కోసం పంజాబ్‌ తరఫున బరిలోకి దిగనున్నారు.

డిసెంబర్‌ 24 నుంచి ప్రారంభంకాబోయే విజయ్‌ హజారే ట్రోఫీ కోసం 18 మంది సభ్యుల పంజాబ్‌ జట్టును ఇవాళ (డిసెంబర్‌ 22) ప్రకటించారు. ఈ జట్టులో శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ, అర్షదీప్‌ సింగ్‌తో పాటు రమన్‌దీప్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, నమన్‌ ధిర్‌ లాంటి ఐపీఎల్‌ స్టార్లు కూడా చోటు దక్కించుకున్నారు.

ఈ జట్టుకు పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (PCA) కెప్టెన్‌ను ప్రకటించకపోవడం విశేషం. గత సీజన్‌లో అభిషేక్‌ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఈ సీజన్‌లో టీమిండియా వన్డే జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ జట్టులో ఉండటంతో PCA ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. బహుశా చివరి నిమిషంలో కెప్టెన్‌ పేరును ప్రకటించే అవకాశం ఉంది.

కాగా, VHTలో భాగంగా పంజాబ్‌ డిసెంబర్‌ 24నే తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. జైపూర్‌ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని మహారాష్ట్ర జట్టును ఢీకొట్టనుంది. భారత్‌-న్యూజిలాండ్‌ సిరీస్‌ కారణంగా గిల్‌, అభిషేక్‌ VHT మొత్తానికి అందుబాటులో ఉండరు. గిల్ వన్డే సిరీస్‌ సమయానికి.. అభిషేక్ టీ20 సిరీస్ సమయంలో పంజాబ్‌ జట్టుకు అందుబాటులో ఉండడు.  

విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 కోసం పంజాబ్ జట్టు.. 
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్‌కీపర్‌), హర్నూర్ పన్ను, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉదయ్ సహరన్, నమన్ ధిర్, సలిల్ అరోరా (వికెట్‌కీపర్‌), సన్వీర్ సింగ్, రమన్‌దీప్ సింగ్, జషన్‌ప్రీత్ సింగ్, గుర్నూర్ బ్రార్, హర్ప్రీత్ బ్రార్, రఘు శర్మ, కృష్ణ భగత్, గౌరవ్ చౌధరి, సుఖ్‌దీప్ బజ్వా.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement