గిల్‌ గాయపడితే ఇతడిని ఆడిస్తారా?: రవిశాస్త్రి ఫైర్‌ | Why is He not there: Ravi Shastri Explosive Samson vs Gill comment on air | Sakshi
Sakshi News home page

గిల్‌ గాయపడితే ఇతడిని ఆడిస్తారా?: రవిశాస్త్రి ఫైర్‌

Dec 20 2025 11:42 AM | Updated on Dec 20 2025 11:59 AM

Why is He not there: Ravi Shastri Explosive Samson vs Gill comment on air

గత ఏడాది కాలంగా భారత టీ20 జట్టులో సంజూ శాంసన్‌ కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అభిషేక్‌ శర్మకు సరైన ఓపెనింగ్‌ జోడీగా వచ్చి వరుస శతకాలతో అలరించాడు. కానీ ఆసియా టీ20 కప్‌-2025 సందర్భంగా వైస్‌ కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ రీఎంట్రీ ఇవ్వడంతో సంజూ స్థానం గల్లంతైంది.

గిల్‌ వరుస వైఫల్యాలు
గిల్‌ను ఆడించే క్రమంలో సంజూను తొలుత మూడో స్థానంలో.. ఆ తర్వాత మిడిలార్డర్‌లో ఒకటీ రెండు మ్యాచ్‌లలో ఆడించి.. అనంతరం తుదిజట్టు నుంచే తప్పించింది యాజమాన్యం. మరోవైపు.. గిల్‌ (Shubman Gill) పునరాగమనంలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు కనీసం ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా చేయలేదు.

సంజూ ధనాధన్‌
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి గిల్‌ కేవలం 33 పరుగులే చేశాడు. ఇందులో ఓ గోల్డెన్‌ డక్‌ కూడా ఉంది. ఇక పాదానికి గాయమైన కారణంగా గిల్‌ సౌతాఫ్రికా (IND vs SA)తో ఆఖరిదైన ఐదో టీ20కి దూరమయ్యాడు. దీంతో సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు ఇచ్చిన మేనేజ్‌మెంట్‌ ప్రయోగాలకు వెళ్లకుండా ఈసారి అతడిని ఓపెనర్‌గానే పంపింది.

వచ్చిన అవకాశాన్ని సంజూ సద్వినియోగం చేసుకున్నాడు.  కేవలం 22 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 37 పరుగులు సాధించాడు. అయితే, జార్జ్‌ లిండే అద్భుత బంతితో సంజూను బౌల్డ్‌ చేశాడు. కాగా గిల్‌ మూడు మ్యాచ్‌లలో కలిపి చేసిన పరుగుల కంటే కూడా సంజూ ఈ ఒక్క ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులే ఎక్కువ కావడం గమనార్హం.

గిల్‌ గాయపడితే ఇతడిని ఆడిస్తారా?
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి మేనేజ్‌మెంట్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కామెంట్రీలో భాగంగా మాట్లాడుతూ.. ‘‘తుదిజట్టులో అతడు అసలు ఎందుకు లేడు? ఇలాంటి ఆటగాడిని పక్కనపెడతారా? ఓ ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో ఇతడిని ఆడిస్తారా?

టాపార్డర్‌లో సంజూ సహజమైన శైలిలో ఆడగలడు. సౌతాఫ్రికా గడ్డ మీద టీ20 క్రికెట్‌లో వరుస సెంచరీలు బాదాడు. అతడొక విధ్వంసకర బ్యాటర్‌, డేంజరస్‌ ప్లేయర్‌. అద్భుతమైన షాట్లు ఆడటంలో దిట్ట. అయినా సరే అతడిని పక్కనపెడతారా?’’ అంటూ రవిశాస్త్రి యాజమాన్యం విధానాలను తప్పుబట్టాడు.

కాగా అహ్మదాబాద్‌తో సౌతాఫ్రికాతో ఐదో టీ20 సందర్భంగా సంజూ శాంసన్‌ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన పద్నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో 8 వేల పరుగుల మార్కును అందుకుని.. ఈ ఫీట్‌ నమోదు చేసిన ఏడో భారత బ్యాటర్‌గా అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు. 

చదవండి: రోహిత్‌ శర్మ యూటర్న్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement