సౌతాఫ్రికాతో ఐదో టీ20లో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. అహ్మదాబాద్ వేదికగా ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం పదహారు బంతుల్లోనే హార్దిక్ పాండ్యా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
ఫాస్టెస్ట్ ఫిఫ్టీ
తద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన రెండో ఆటగాడిగా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మను అధిగమించి.. యువరాజ్ సింగ్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికాపై 2-1తో ఆధిక్యంలో ఉంది టీమిండియా.
తిలక్ వర్మ విధ్వంసం
ఇక శుక్రవారం అహ్మదాబాద్‌లోనూ గెలిచి సిరీస్‌ను 3-1తో గెలుచుకోవాలనే సంకల్పంతో బరిలోకి దిగింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్ (22 బంతుల్లో 37), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 34) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు.
.@TilakV9 is not holding back! Brings up a quick-fire half century! 💪#INDvSA 5th T20I | LIVE NOW 👉 https://t.co/adG06ykx8o pic.twitter.com/P4cz4TX7lc
— Star Sports (@StarSportsIndia) December 19, 2025
నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) మరోసారి తీవ్రంగా నిరాశపరచగా.. అతడు అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి, స్టాండ్స్‌లోకి తరలించి అభిమానులను ఉర్రూతలూగించాడు. నాలుగు ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాది 16 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు దాటేశాడు.
అనూహ్య రీతిలో
మొత్తంగా 25 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 5 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 63 పరుగులు సాధించాడు. అయితే, ఒట్నీల్ బార్ట్‌మన్ బౌలంగ్‌లో షాట్ ఆడే క్రమంలో రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు.
Watch out! The ball is being powered across the ground today. ⚡️@hardikpandya7 starts his innings with a maximum! 🙌#INDvSA 5th T20I | LIVE NOW 👉 https://t.co/adG06ykx8o pic.twitter.com/NjCNUJh71c
— Star Sports (@StarSportsIndia) December 19, 2025
ఇక తిలక్ వర్మ (42 బంతుల్లో 73) అనూహ్య రీతిలో పందొమ్మిదో ఓవర్ ఐదో బంతికి రనౌట్ కాగా.. శివం దూబే మూడు బంతుల్లో పది పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 231 పరుగుల భారీ స్కోరు సాధించింది. సఫారీ బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు తీయగా.. జార్జ్ లిండే, ఒట్నీల్ బార్ట్‌మన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
భారత్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 ఫిఫ్టీలు నమోదు చేసింది వీరే
🏏యువరాజ్ సింగ్- 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ మీద 12 బంతుల్లో ఫిఫ్టీ
🏏హార్దిక్ పాండ్యా- 2025లో సౌతాఫ్రికా మీద 16 బంతుల్లో ఫిఫ్టీ
🏏అభిషేక్ శర్మ- 2025లో ఇంగ్లండ్ మీద 17 బంతుల్లో ఫిఫ్టీ
🏏కేఎల్ రాహుల్- 2021లో స్కాట్లాండ్ మీద 18 బంతుల్లో ఫిఫ్టీ
🏏సూర్యకుమార్ యాదవ్- 2022లో సౌతాఫ్రికా మీద 18 బంతుల్లో ఫిఫ్టీ.
చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!


