టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించని షాకిచ్చాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025 సీజన్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ స్వయంగా వెల్లడించాడు.
కాగా ప్రస్తుత టీమిండియాలోని ప్రతి ఒక్క క్రికెటర్ విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశించిన విషయం తెలిసిందే. కుదిరితే ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు ఆడాలని.. లేదంటే తమ దేశవాళీ జట్ల తరఫున కనీసం రెండు మ్యాచ్‌లైనా ఆడాలని ఆదేశించింది.
ప్రతి ఒక్కరు ఈ నిబంధన పాటించాల్సిందే
డిసెంబరు 24 నుంచి ఈ దేశీ వన్డే టోర్నీ మొదలుకానున్న నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) సహా ప్రతి ఒక్కరు ఈ నిబంధన పాటించాలని బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉంటే.. వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి అన్‌ఫిట్ అన్న సర్టిఫికెట్ పొందితేనే మినహాయింపు ఇస్తామని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రాబబుల్స్ జట్టులో కోహ్లి పేరు కనిపించింది. మరోవైపు.. తాజాగా ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) మాత్రం టీమిండియా సీనియర్లలో చాలా మంది విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో లేరని తెలిపింది. ముఖ్యంగా భారత జట్టు దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రశ్న ఎదురుకాగా ఎంసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ మాట దాటవేశాడు.
అందుబాటులో లేరు
టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ముంబై జట్టుకు చెందిన టీమిండియా ఆటగాళ్లలో ప్రస్తుతానికి ఎవరూ మాకు అందుబాటులో లేరు. అలాంటపుడు వారిని జట్టులో చేర్చడం సరికాదు కదా!.. వారికి బదులు యువ ఆటగాళ్లకు జట్టులో చోటునిస్తాం’’ అని సంజయ్ పాటిల్ తెలిపాడు.
కాగా రోహిత్ శర్మ ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా.. మనుపటి కంటే సన్నబడి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డేల్లోనూ అదరగొట్టాడు. అయితే, విజయ్ హజారే ట్రోఫీకి అతడు ఎందుకు అందుబాటులో లేడన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో సిరీస్‌తో బిజీగా ఉన్న టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు శివం దూబే కూడా ముంబై జట్టులో ఉండటం లేదు.
వారికే సడలింపు
టీ20 ప్రపంచకప్-2026 నాటి వీరు పూర్తిస్థాయి ఫిట్‌గా ఉండటం.. గాయాల బారిన పడకుండా ఉండటం అత్యంత ముఖ్యం. అందుకే వీరికి సడలింపు దొరికినట్లు తెలుస్తోంది. మరోవైపు.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడిన టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అనారోగ్యం వల్ల ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
ఇక గాయం నుంచి కోలుకుంటున్న ముంబై మాజీ సారథి అజింక్య రహానే సైతం ఈ టోర్నీకి దూరం కానుండగా.. శ్రేయస్ అయ్యర్‌దీ ఇదే పరిస్థితి అని సమాచారం. ఈ నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్ కెప్టెన్సీలోని ముంబై జట్టులో సర్ఫరాజ్ ఖాన్, అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ తదితరులు చోటు దక్కించుకున్నారు. ఇషాన్ ముల్‌చందానికి తొలిసారిగా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా డిసెంబరు 24- జనవరి 8 వరకు విజయ్ హజారే ట్రోఫీ గ్రూప్ దశ జరుగనుంది.
చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్


