ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ యాషెస్ సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన గ్రీన్.. ఇప్పుడు అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో అదే తీరును కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటైన గ్రీన్.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. జోష్ టంగ్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బౌలింగ్‌లోనూ కేవలం ఒక్క వికెట్ పడగొట్టాడు.
కేకేఆర్‌కు హెడ్‌ఎక్..
ఇటీవల దుబాయ్‌లో జరిగిన మినీ వేలంలో గ్రీన్‌ను రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. గ్రీన్‌ను ఒక కంప్లీట్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకున్న కేకేఆర్.. అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణిస్తాడని నైట్‌రైడర్స్ ఆశిస్తోంది. కానీ రెడ్ బాల్ క్రికెట్‌లో అతడి ప్రస్తుత ఫామ్ కోల్‌కతా మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ముఖ్యంగా ఒత్తిడి సమయాల్లో ఆడలేక వికెట్ పారేసుకోవడం చర్చనీయంగా మారింది.
భారీ ఆధిక్యం దిశగా ఆసీస్..
అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ జోరు కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కంగారూ జట్టు ప్రస్తుతం 356 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ అడిలైడ్ టెస్టులో ట్రావిస్ హెడ్ సెంచరీతో సత్తాచాటాడు. 142 పరుగులతో హెడ్ నాటౌట్‌గా ఉన్నాడు. అతడితో పాటు అలెక్స్ కారీ(52) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'


