అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 213/8 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగుల వద్ద ఆలౌటైంది.
టాపార్డర్ విఫలమైనప్పటికి.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (198 బంతుల్లో 83), లోయార్డర్ బ్యాటర్ జోఫ్రా ఆర్చర్(105 బంతుల్లో 51) విరోచిత పోరాటం కనబరిచారు. ‘బాజ్‌బాల్’ ఆటతీరును పక్కన పెట్టిన స్టోక్స్... సంప్రదాయ టెస్టు క్రికెట్ ఫార్మాట్‌లో ఓవర్లకు ఓవర్లు క్రీజులో పాతుకుపోయి బ్యాటింగ్ చేశాడు.
ఈ క్రమంలో బ్రూక్‌తో ఐదో వికెట్‌కు 56 పరుగులు జోడించిన స్టోక్స్... తొమ్మిదో వికెట్‌కు ఆర్చర్‌తో 106 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆర్చర్ కూడా ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులు వెనకబడింది.
శాంతించిన స్టార్క్..
గత రెండు మ్యాచ్‌ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు దక్కించుకున్న మిచెల్ స్టార్క్ ఈసారి కాస్త శాంతించగా... ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ తలా 3 వికెట్లతో సత్తా చాటారు. నాథన్ లయన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో ఆ్రస్టేలియా బౌలర్‌గా లయన్ నిలిచాడు.
పేస్ దిగ్గజం మెక్‌గ్రాత్‌ను అతడు అధిగమించాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 326/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా... చివరకు 91.2 ఓవర్లలో 371 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ స్టార్క్ (75 బంతుల్లో 54; 9 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 5 వికెట్లు పడగొట్టగా... కార్స్, జాక్స్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
చదవండి: సమమా... సొంతమా!


